ఎమ్మెల్యే సుజనా : అంతా గత వైభవమేనా ?
కేబినెట్ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు కంటే కూడా తన ఆయన ఢిల్లీలో పార్టీ తరఫున చురుకుగా ఉండేవారు అని చెబుతారు.;

ఆయన టీడీపీలో ఉన్నపుడు ఎంతో కీలకంగా ఉండేవారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవారు. ఆయన హవా గురించి మీడియాలో రకరకాలుగా చెప్పుకునేవారు. 2014 నుంచి 2019 మధ్యలో ఎన్డీయే ప్రభుత్వంలో సుజనా చౌదరి కీలకమైన మంత్రిత్వ శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. కేబినెట్ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు కంటే కూడా తన ఆయన ఢిల్లీలో పార్టీ తరఫున చురుకుగా ఉండేవారు అని చెబుతారు. అలాగే ప్రాధాన్యత అందుకునేవారు అని అంటారు.
ఇక ఆయన 2019లో ఏపీలో టీడీపీ ఓటమి పాలు కావడంతో బీజేపీలోనికి వెళ్ళారు. 2022 దాకా ఆయన రాజ్యసభ సభ్యత్వం ఉండేది. దాంతో బీజేపీ హైకమాండ్ వద్ద కూడా ఆయన పలుకుబడి వేరే లెవెల్ అన్నట్లుగా కధ సాగింది. ఆయనను ఒక దశలో కేంద్ర మంత్రిగా చేస్తారు అని ప్రచారం సాగింది. అంతే కాదు ఆయనను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమిస్తారు అని వార్తలు వచ్చాయి.
అయితే 2022లో రాజ్యసభ నుంచి రిటైర్ అయినా 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల దాకా ఆయనకు ఏ పదవీ దక్కలేదు. బీజేపీ కోటాలో మరోసారి రాజ్యసభకు వెళ్ళాలని సుజనా చౌదరి అనుకున్నా అది అసలు జరగలేదు. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఆయన విశాఖ కానీ విజయవాడ కానీ ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేశారు అని అంటారు. కానీ అవేమీ దక్కలేదు.
ఆఖరులో ఆయనకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు దక్కింది. ముస్లిం మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉన్న చోట నుంచి ఆయన కూటమి ప్రభంజనంలో గెలిచి సత్తా చాటారు. నిజంగా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి టఫ్ సీటు నుంచి గెలవడం అంటే మాటలు కాదు, కానీ సుజనా చౌదరి తానేంటో అలా నిరూపించుకున్నారు.
ఇక ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. తనకు తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ బీజేపీకి ఇచ్చిన ఒకే ఒక్క మంత్రి పదవి కాస్తా సత్య కుమార్ యాదవ్ కి వెళ్ళింది. అలా బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇపుడు చూస్తే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పోస్టు ఒకటి ఖాళీ అవుతోంది.
ఆ పదవి ఇచ్చినా సుజనా చౌదరి లాంటి వారికి ఎంతో గౌరవంతో పాటు హుందాతనంగా ఉంటుందని అంటున్నారు. అయితే పురంధేశ్వరి ఖాళీ చేసే ఈ పోస్టుని బీసీ సామాజిక వర్గానికి ఇస్తారు అని అంటున్నారు ఎందుకంటే వెంటనే అదే సామాజిక వర్గానికి ఎంపిక చేయరు అని అంటున్నారు. దాంతో సుజనా ఆశలు ఇక్కడ కూడా నెరవేరే అవకాశాలు లేవు అని అంటున్నారు.
దాంతో ఆయన జస్ట్ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు అని అంటున్నారు. విజయవాడలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఫ్యూచర్ లో కూడా మంత్రి పదవి ఆయనకు దక్కుతుందా అంటే ఏమో అన్న మాట వినిపిస్తోందిట. రెండు దఫాలు పన్నెండేళ్ళ పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన సుజనా చౌదరి ప్రస్తుతానికి ఒక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు అని అంటున్నారు.
ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి రాంగ్ డెసిషన్ తీసుకున్నారా అన్నది కూడా ఆయన సన్నిహితులలో ఉందిట. ఏది ఏమైనా రానున్న నాలుగేళ్ళ కాలంలో ఏదైనా అద్భుతం జరిగి ఆయనకు మంచి హోదా వస్తే ఓకే కానీ లేకపోతే అంతా గత వైభవంగా మిగిలిపోతుందేమో అన్న ఆందోళన కూడా వారిలో ఉందిట.