ఎమ్మెల్యేగా సుజనా వర్కింగ్ స్టైల్ సూపరేహే !
ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదని ప్రజా నేత కాదని ఎన్నో విమర్శలు వచ్చాయి.
ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదని ప్రజా నేత కాదని ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి చివరి నిముషంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంచి మెజారిటీతో గెలిచారు. ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో పదవి ఖాయమని అంతా అనుకున్నారు.
కానీ వివిధ సామాజిక సమీకరణల వల్ల దక్కలేదు. అయితే గెలిచిన తరువాత నుంచి సుజనా చౌదరి మీడియా మీటింగ్స్ పెట్టడం లేదు, ప్రత్యర్ధి పార్టీని విమర్శించడం లేదు. ఫుల్ సైలెంట్ గా ఉన్నారు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన అలా కాదు చాలా కూల్ గా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నారు.
ఆ విషయం ఇపుడు బయటపడింది. ఇదీ నా ప్రోగ్రెస్ రిపోర్టు అంటూ సుజానా చౌదరి కొత్త రాజకీయ ఒరవడిని సృష్టించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గత నలభై అయిదు రోజులుగా ఆయన నియోజకవర్గానికి చేసిన మేలు ఏమిటి అన్నది ఒక్కో దానిని రాయించి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఆ ఫ్లెక్సీలలో తాను చేసిన పనులకు సంబంధించి ఫోటోలు కూడ వేసి మరీ ఆయన చూపించారు. అలా తాను పనిమంతుడిని అని చాటుకున్నారు. ఇలా తన పనితీరుని చెబుతూ నియోజకవర్గం మొత్తం మీద పోస్టర్లు బ్యానర్లు ఆయన ఏర్పాటు చేసి మరీ జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఈ పోస్టర్లు ఫ్లెక్సీలలో ఏముంది అని చూస్తే కనుక విజయవాడ వెస్ట్ లోని వివిధ వార్డులలో చేసిన పనులుగా చెప్పుకున్నారు. 39వ వార్డులో కల్వర్టు పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే సుజనా ప్రకటించారు. అలాగే, 41వ వార్డులోని గాలిబ్ షాహిద్ దర్గా వద్ద చాన్నాళ్ళుగా ఉన్న డ్రైనేజీ సమస్యకు ఒక పరిష్కారం చూపామని చెప్పారు.
అదే విధంగా ఇదే వార్డులో ఊర్మిళ నగర్ మెయిన్ రోడ్డు రహదారి సమస్యకు పరిష్కారం తాను చూపించాను అని పేర్కొన్నారు. ఇక 42వ వార్డులోని లలిత నగర్‌లో మ్యాన్ హోల్ సమస్యకు పరిష్కారం చూపించామని, 45వ వార్డులోని రోడ్డు మధ్యలో ప్రయాణీకులకు అడ్డుగా ఉన్న పోల్ తొలగించామని, ఇదే వార్డులో తాగునీటి పైపులైన్లు కోసం తీసిన గోతులను పూడ్చి వేయించామని చెప్పుకున్నారు.
అంతే కాదు, కేఎల్ రావు నగర్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం కనుగొన్నామని ఇక 47వ వార్డులోని తాగునీటి పైపులైన్లకు మరమ్మత్తులు చేయించామని, ఇదే వార్డులో పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం చూపించాని ఇక విద్యాధరపురంలో ఎండిపోయిన చెట్లు తొలగించామని సుజనా చౌదరి పేర్కొంటూ వాటిని అన్నింటినీ రాసి మరీ ఫ్లెక్సీలు వేయించారు.
అయితే సుజనా చౌదరి చెప్పిన ఈ పనుల మీద మెచ్చుకోలు ఉంది, విమర్శలూ ఉన్నాయి. ఆయన చేసిన పనులు బాగున్నాయని కొంతమంది అంటూంటే అవి ఎమ్మెల్యే స్థాయి పనులా అని పెదవి విరుస్తున్న వారూ ఉన్నారట. ఆయన ఎమ్మెల్యే అని కానీ కార్పోరేటర్లు చేయాల్సిన పనులు చేసి తాను ఏదో చేశాను అని చెప్పుకోవడమేంటని అంటున్నారు.
ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం ఒక యూనిట్ గా తీసుకుని పనిచేయాలి. రెండు లక్షల మందికి పైగా ఉండే జనాభాకు ప్రధానమైన సమస్యలు ఏమిటో చూసి వాటిని తీర్చాలి. అలాగే రోడ్ల అభివృద్ధి, స్థానికంగా ఉపాధి అవకాశాల మెరుగుదల, వివిధ సామాజిక వర్గాల వారికి ఆర్ధికంగా ఇతరత్రా ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని అంటున్నారు. ఆయన ఫ్లెక్సీల మీద వేసిన వాటిని చూసిన వారి ఇవి సామాన్యుడు ఫోన్ చేసినా అయ్యే పనులే అని అనడమూ చిత్రమే.
ఏది ఏమైనా సుజనా చౌదరి ఒక ట్రెండ్ కి తెర తీశారు. తాను చిన్నవో పెద్దవో పనులు చేశానని చెప్పుకున్నారు. రానున్న రోజులలో నియోజకవర్గం సమస్యల మీద కూడా ఫోకస్ పెడతారేమో. వేచి చూడడం మంచిది కదా అని అంటున్న వారూ ఉన్నారు. మరో వైపు ఇతర ఎమ్మెల్యేలు కూడా సుజనా బాటలో తాము నియోజకవర్గంలో ఏమి చేశామో చెబుతారా అన్న చర్చకు తెర లేస్తోంది.