బొబ్బిలి రాజాకు హుందా అయిన పదవి

విజయనగరంలో పూసపాటి రాజులతో పాటు బొబ్బిలి రాజులు కూడా ఎంతో ఫ్యామస్. ఈ రెండు రాజ కుటుంబాలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నాయి;

Update: 2025-04-08 03:00 GMT
బొబ్బిలి రాజాకు హుందా అయిన  పదవి

విజయనగరంలో పూసపాటి రాజులతో పాటు బొబ్బిలి రాజులు కూడా ఎంతో ఫ్యామస్. ఈ రెండు రాజ కుటుంబాలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నాయి. ప్రజాస్వామ్య శకానికి ముందు అతి పెద్ద సంస్థానాలను పాలించిన చరిత్ర వీరి పూర్వీకులకు ఉంది.

రాజు ఎక్కడైనా రాజు అన్నట్లుగానే వీరి దర్జా వైభవం ఉంటూ వస్తోంది. ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలు వారిని ఆదరించి పట్టం కడుతూ ఉంటారు. పూసపాటి వారి వంశంలో అనేక మంది పదవులు అందుకున్నారు. సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అయితే రాజకీయంగా కొంత రెస్ట్ పాటిస్తున్నారు.

తన వారసురాలిగా కుమార్తెని తెచ్చారు. అతిది గజపతిరాజు విజయనగరం సీటు నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఇక బొబ్బిలి వంశంలో ఇద్దరు అన్నదమ్ములు రాజకీయంగా రాణిస్తున్నారు. సుజయ క్రిష్ణ రంగారావు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఇపుడు తమ్ముడు బేబీ నాయన బొబ్బిలి ఎమ్మెల్యేగా ఉన్నారు.

అయితే సుజయ క్రిష్ణ రంగారావుకి కూటమి ప్రభుత్వం అటవీ అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవిని ఇచ్చి గౌరవించింది. అది కాకుండా ఇపుడు మరో హుందా అయిన పదవి ఆయనను వరించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆయనను అసోసియేషన్ గవర్నింగ్ బాడీ చైర్మన్ గా ఆయనను ఎన్నుకున్నారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న ఆంధ్రా ప్రీమియం లీగ్ 2025 నిర్వహణ బాధ్యతలను చైర్మన్ హోదాలో సుజయ క్రిష్ణ రంగారావు నిర్వహించనున్నారు. ఎంతో కీలకమైన ప్రతిష్టాత్మకమైన ఈ చైర్మన్ పదవిని అందుకున్న సుజయక్రిష్ణను పలు క్రికెట్ సంఘాలతో పాటు క్రికెట్ అభిమానులు క్రీడాభిమానులు అభినందిస్తున్నారు.

బొబ్బిలి రాజా వారికి హుందా అయిన పదవి దక్కింది అని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ పదవిలో ఆయన నిండుగా రాణించాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొబ్బిలి రాజులకు ప్రత్యేక స్థానం ఉంది.

అందువల్లనే కూటమి ప్రభుత్వం ఆయనను తగిన విధంగా గౌరవిస్తోంది అని అంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఆయన ఆసక్తులు ఏమైనా టికెట్ దక్కలేదని ప్రచారం సాగింది. అయితే ఫిఫ్టీ ప్లస్ లో ఉన్న సుజయ క్రిష్ణ జిల్లాలో భవిష్యత్తు నాయకుడిగా బలమైన నేతగా ఉంటారు అన్న ఆలోచనలతో కూటమి పెద్దలు ఉన్నారు. దానికి తగినట్లుగానే ఆయనకు ఈ కీలక పదవులు వరిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News