వదల బొమ్మాళీ వదల.. కవితకు సుఖేష్ సంచలన లేఖ!
ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ మళ్లీ బాంబుపేల్చాడు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఎనఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవితను ప్రశ్నించడానికి ఈడీ తమ కస్టడీకి తీసుకుంది. ఈ మేరకు ఈడీ చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకరించింది. రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారడంలో కవితదే కీలకపాత్ర అని ఈడీ విశ్వసిస్తోంది. ఇందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని అంటోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ మళ్లీ బాంబుపేల్చాడు. ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ మేరకు అతడు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్ జైలు క్లబ్‌లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆమెపై సెటైర్లు పేల్చాడు.
తాజాగా సుఖేష్ చంద్రశేఖర్.. కవితకు రాసిన ఈ లేఖలో..తీహార్ జైలు కౌంట్ డౌన్ కవితకు ప్రారంభమైందని పేర్కొన్నాడు. త్వరలో కవిత తీహార్ జైలు క్లబ్ లో సభ్యులు కాబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్టు అవుతారని వెల్లడించాడు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన అంతా బయటపడుతుందని బాంబుపేల్చాడు. వీరి వాట్సాప్ చాటింగ్, కాల్స్ పై దర్యాప్తు జరుగుతోందన్నాడు.
అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం చేయవద్దని తాను సలహా ఇస్తున్నానని సుఖేష్ తన లేఖలో పేర్కొన్నాడు. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దన్నాడు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసని సుఖేష్ చంద్రశేఖర్ కవితకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. మీ అందరికీ తీహార్ జైలులో స్వాగతం పలికేందుకు తాను ఎదురుచూస్తుంటాను అని వ్యాఖ్యానించాడు.
మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తోంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మార్చి 19న మూడో రోజు ఈడీ అధికారులు కవితకు మరిన్ని ప్రశ్నలు వేయనున్నారు.
ఇంకోవైపు కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. అరెస్టు చేయొద్దనే ఆదేశాలు ఉన్నా తనను అరెస్టు చేశారని.. కవిత సుప్రీంకోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో, సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో ఆసక్తి రేపుతోంది.