మెగా డాటర్ తో సినిమా.. అందుకేనా ఈ నేతకు టికెట్!?
ముఖ్యంగా సుందరపు సతీశ్ మెగా డాటర్ నిహారికతో సినిమా చేస్తున్నారని.. ఆ సినిమాకు ఆయనే నిర్మాత అని టాక్ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ, టీడీపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య పలుమార్లు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి. బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసే అవకాశం ఉండటంతో మరికొద్ది రోజుల్లో తాము పోటీ చేసే సీట్లను ఈ పార్టీలు ప్రకటించనున్నాయి.
కాగా ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ జనసేన పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. 2009లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ విశాఖ జిల్లాలో నాలుగు సీట్లలో గెలుపొందింది. మరికొన్ని సీట్లను చాలా తక్కువ మెజారిటీతో పోగొట్టుకుంది. ఈ నేపథ్యంలో మెగాభిమానులు ఎక్కువ ఉన్న ఉత్తరాంధ్రలోనూ తమకు సీట్లు కావాలని జనసేన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
కాగా విశాఖ జిల్లాలోనే యలమంచిలి నియోజకవర్గానికి సుందరపు విజయకుమార్ ఇంచార్జిగా ఉన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో యలమంచిలి నుంచి ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు యలమంచిలి విజయకుమార్ తోపాటు ఆయన సోదరుడు యలమంచిలి సతీశ్ కూడా సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది. గాజువాక లేదా అనకాపల్లి పార్లమెంటరీ స్థానం ఇవ్వాలని సతీశ్ కోరుతున్నట్టు చెబుతున్నారు.ప్రస్తుతం సతీష్ ప్రముఖ కాంట్రాక్టరుగా ఉన్నారు. మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇటీవల జనసేన ముఖ్య నేత నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో జరిగింది. అతి తక్కువ మంది అతిథులను మాత్రమే ఈ వేడుకకు పిలిచారు. అందులో సుందరపు సతీశ్ కూడా ఉన్నారని అంటున్నారు.
ముఖ్యంగా సుందరపు సతీశ్ మెగా డాటర్ నిహారికతో సినిమా చేస్తున్నారని.. ఆ సినిమాకు ఆయనే నిర్మాత అని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సుందరపు సోదరులకు నాగబాబు అమిత ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేనలోనే ఒక వర్గం నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని టాక్.
ముందు నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న తమకు కాకుండా పోర్టు కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన సుందరపు సతీశ్ కు నాగబాబు అమిత ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేనలోకి కొందరు నేతలు కారాలు మిరియాలు నూరుతున్నట్టు టాక్ నడుస్తోంది.
సతీష్ తాను నాగబాబుకు అత్యంత సన్నిహితునిగా చెప్పుకోవడం, అందుకు తగ్గట్టే నాగబాబు వ్యవహార శైలి ఉండడం పార్టీలో ఇతర నాయకులకు మింగుడు పడడం లేదని అంటున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా గాజువాక సీటు తనకు ఖరారైందని సతీశ్ చెబుతున్నారని వినికిడి. ఈ నేపథ్యంలో సుందరపు కుటుంబానికి మితిమీరిన ప్రాధాన్యత ఇస్తుండటంపై మిగిలిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.