అప్రూవర్ గా మారిపోతా.. వివేకా కేసులో ఏ2 సునీల్ యాదవ్ మరో సంచలనం!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాం చోటుచేసుకుంది.;

Update: 2025-03-20 10:17 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ కూడా అప్రూవర్ గా మారిపోతాననే సంకేతాలిస్తున్నాడు. వివేకానందరెడ్డి హత్య ఎందుకు జరిగింది? ఈ హత్యకు కుట్ర పన్నింది ఎవరు? అన్న విషయాలు తనకు పూర్తిగా తెలుసునని, అవన్నీ కోర్టులో చెప్పేస్తానని గురువారం మీడియాకు వెల్లడించాడు సునీల్ యాదవ్. తనకు ప్రాణ హాని ఉందని చెబుతున్న సునీల్ యాదవ్ ఈ రోజు కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఆరేళ్ల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ చార్జిషీటు వేయకపోవగా, ఈ ఆరేళ్ల కాలంలో ఆరుగురు కీలక సాక్ష్యులు మరణించారు. ఇదే సమయంలో తనకు ప్రాణహాని ఉందంటూ నిందితులు, అప్రూవర్ గా మారిన సాక్షి దస్తగిరి చెబుతున్నాడు.ఇక ఏ2 సునీల్ యాదవ్ ను కూడా పులివెందులకు చెందిన కొందరు వైసీపీ నేతలు బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నాడు. చంచల్ గూడ జైలులో కూడా తనను హతమార్చేందుకు ప్లాన్ చేశారని, తనకు ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నాడు.

వివేకా హత్య వెనుక చాలా కుట్ర ఉందని, దీనిపై తాను ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని, అనేక బాధలు పడ్డానని సునీల్ యాదవ్ చెబుతున్నాడు. అయితే ఇప్పుడు తననే బెదిరిస్తున్న పరిస్థితి ఎదురవుతోందని అన్నాడు. వివేకా దారుణ హత్య వెనుక కుట్ర చేసింది ఎవర్నది త్వరలోనే చెబుతానని సునీల్ యాదవ్ ప్రకటించాడు. దీంతో వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడుతున్నాయి. కాగా, వివేకా హత్య కేసు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయంగా చిన్నాన్న అయినప్పటికీ గత ఐదేళ్లలో నిందితుల అరెస్టు, కేసు విచారణకు అనేక సమస్యలు ఎదురయ్యాయని విమర్శలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వమైన తమకు న్యాయం చేయాలని వివేకా కుమార్తె సునీత కోరుతున్నారు. ఇక ఇదే కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా ప్రాణహాని అంటూ భయపడుతున్నాడు.

Tags:    

Similar News