"చిన్నాన్న అంటే తెలుసా"?... జగన్ వ్యాఖ్యలపై సునీత రియాక్షన్ వైరల్!

దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీత స్పందించారు.

Update: 2024-03-28 11:50 GMT

"మేమంతా సిద్ధం" అంటూ వైఎస్ జగన్ చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్యోదంతంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతోపాటు.. వివేకా హత్యపై చర్చకు కూడా తాను సిద్ధం అని ప్రకటించారు. దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీత స్పందించారు.

అవును... "మేమంతా సిద్ధం" సభలో ప్రసంగించిన సందర్భంగా... వైఎస్ వివేకా చిన్నాన్నను ఎవరు చంపారు, ఎవరు చంపించారో.. ఆయనకు, దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు అని మొదలుపెట్టిన జగన్... బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు.. వారి వెనుక ఎవరున్నారనే విషయం అందరికీ మీ అందరికీ తెలుసంటూ స్థానిక ప్రజానికాన్ని ఉద్దేశించి అన్నారు. వాళ్లు మీ అందరికీ రోజూ కనిపిస్తూనే ఉన్నారని చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలపై సునీత స్పందించారు.

ఇందులో భాగంగా... చిన్నాన్న అంటే అర్ధం తెలుసా? నాన్న తర్వాత నాన్న అని మొదలుపెట్టిన సునీత... చిన్నన్నాను ఎవరు చంపారో దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసని అంటున్నారు. అవును... మీరు చెప్పింది నిజమే! వివేకాను చంపించింది ఎవరో దేవుడికి, జిల్లా ప్రజలకు, మీకూ తెలుసు.. అందుకే నిందితులను అంత బాగా రక్షిస్తున్నారు అని స్పందించారు. ఇదే సమయంలో... వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డే హత్య చేయించారని హంతకుడే చెబుతున్నారని తెలిపారు.

ఇదే సమయంలో సినిమాలో రౌడీలు ఉంటారు.. విలన్ ఉంటాడు. కేవలం రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా? విలన్ ను కూడా పట్టుకోవాలి కదా! అని చెప్పిన సునీత... చిన్నన్న చనిపోయి ఐదేళ్లు అవుతోంది.. సానుభూతి పొంది ఎన్నికల్లో ఓట్ల కోసం పాకులాడుతున్నారు అని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా... హంతకులకు ఓటు వేయవద్దని మరోసారి ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. సానుభూతికోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను జగన్ తెరపైకి తెస్తున్నారని సునీత అన్నారు.

కాగా.. వివేకా హత్య, హంతకుడు మొదలైన విషయాలపై స్పందిస్తూ జగన్... వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి.. అవును నేనే చంపాను అని బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో మీరంతా రోజు చూస్తూనే ఉన్నారని చెబుతూ... అతడు ఉండాల్సింది జైల్లో అని అన్నారు. కానీ చంపినతనికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుంటున్నది చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అంటూ జగన్ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News