వివేకా కేసులోకి విజయమ్మ తమ్ముడు.. వాయించేసిన షర్మిల-సునీత!
మరోవైపు వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతలు ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
గత 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన.. ఐదేళ్ల తర్వాత.. ప్రస్తుత ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. మామూలు రేంజ్‌లో కాకుండా.. హై ఓల్టేజ్‌లో రాజకీయాలను మరిగించేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల. మరోవైపు వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతలు ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పటి వరకు ఎంపీ అవినాష్‌పైనే విమర్శలతో విరుచుకుపడిన షర్మిల, సునీతలు తాజాగా.. వారి మేన మామ, కమలాపురం ఎమ్మెల్యే(విజయమ్మ తమ్ముడు) పి. రవీంద్రనాథ్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని రవీంద్రనాథ్‌రెడ్డి.. వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడడం ఏంటని వివేకా కుమార్తె డాక్టర్ సునీత విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఘటనా స్థలంలో రక్తపు మరకలను తుడిచే స్తుంటే.. అవినాష్ రెడ్డి చూస్తూ నిలబడ్డారన్న అంశంపై ఘాటుగా స్పందించారు.
అవినాష్ ఏమన్నా.. పాలు తాగే పిల్లాడా? అని డాక్టర్ సునీత ప్రశ్నించారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా రక్తపు మరకలు తుడిచేస్తుంటే.. మౌనంగా చూస్తూ ఉండడం ఏంటని నిప్పులు చెరిగారు. ఇక, ఈయనను పక్కన పెట్టకుని వివేకా హత్యపై స్పందించడం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి సరికాదన్నారు. ఇది దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసమే వివేకాను దారుణంగా హత్య చేశారని సునీత పదే పదే చెప్పుకొచ్చారు.
ఇక, వైఎస్ షర్మిల సైతం తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వివేకాహత్య కేసులో ఉన్న అవినాష్‌రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడేందుకు సిగ్గులేదా? అని ప్రశ్నించారు. హత్యారా జకీయాలను ప్రోత్సహిస్తున్న వారికి వైసీపీ టికెట్లు ఇచ్చిందని షర్మిల మండిపడ్డారు. ప్రస్తుతం కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల.. రెండు రోజుల కిందటే ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో వివేకా హత్యను సెంట్రిక్‌గా చేసుకుని షర్మిల-సునీతలు నిప్పులు చెరుగుతుండడం గమనార్హం.