మరణ వాంగ్మూలంపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు!
సాధారణంగా హత్య కేసుల్లో మరణం వాంగ్మూలం ఆధారంగా దోషుల్ని నిర్ధారించడం జరుగుతుందనే సంగతి తెలిసిందే
సాధారణంగా హత్య కేసుల్లో మరణం వాంగ్మూలం ఆధారంగా దోషుల్ని నిర్ధారించడం జరుగుతుందనే సంగతి తెలిసిందే. పైగా మరణ వాంగ్మూలానికి కోర్టు అత్యంత ప్రధాన్యత ఇస్తుందని చెబుతారు! అయితే ఈ మరణవాంగ్మూలం విషయంలో కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... దశాబ్దాలుగా మన దేశంలో మరణ వాంగ్మూలాన్ని ఫైనల్ గా భావిస్తుంటారు! అయితే ప్రతీ సందర్భంలోనూ మరణ వాంగ్మూలాల ఆధారంగా దోషుల్ని నిర్ధారించాలా లేక ఇందులో ఏదైనా మినహాయింపు ఉంటుందా అనే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా.. ప్రతిసారీ మరణ వాంగ్మూలం దోషిత్వం నిర్ధారణకు ఆధారంగా చెల్లదని తేల్చిచెప్పేసింది. మరణిస్తూ ఇచ్చిన డిక్లరేషన్ లపై ఆధారపడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సూచించింది.
తాజాగా 2014లో ముగ్గురి హత్య కేసులో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది న్యాయస్థానం. హత్యకు గురైన బాధితురాలి మరణ ప్రకటనలే నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి ఏకైక ఆధారం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యాయస్థానాలు నిజాయితీని అంచనా వేస్తాయిని, కోర్టు మరణిస్తూ ఇచ్చిన డిక్లరేషన్ లపై చట్టపరమైన సూత్రంతో వ్యవహరించిందని గుర్తుచేసింది. అలాగే మరణశయ్యపై ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పడనే నమ్మకాన్ని ఇది స్పష్టం చేసిందని సుప్రీంకోర్టు తెలిపింది.
అయితే ఇది పూర్తిగా విశ్వసనీయంగా ఉండాలని.. విశ్వాసాన్ని ప్రేరేపించాలని.. దాని యథార్థతపై ఏదైనా అనుమానం ఉంటే.. రికార్డులో ఉన్న ఆధారాలు మరణిస్తూ ఇచ్చిన వాంగ్మూలం నిజం కాదని చూపిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ సమయంలో ఇది ఒక సాక్ష్యంగా మాత్రమే పరిగణించబడుతుందని వెల్లడించింది.
మరి ముఖ్యంగా హత్యకు గురైన వ్యక్తి మానసిక స్థితి సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే.. మరణిస్తూ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆమోదించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని మరిముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.