ఈడీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
ప్రత్యర్థి పార్టీల నేతలను వేధించడానికి అధికారంలో ఉన్న పార్టీ ఈడీని ఉపయోగించుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి.
ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్రంలో అధికారంలో ఉన్నవారి చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయిందని ఎప్పటి నుంచో దానిపై విమర్శలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతలను వేధించడానికి అధికారంలో ఉన్న పార్టీ ఈడీని ఉపయోగించుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈడీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసుల దర్యాప్తుల సమయంలో ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టప్రకారం వ్యవహరించాలని ఈడీకి సూచించింది. గురుగ్రాంకు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఈడీపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఎం3ఎం కంపెనీ డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్ అరెస్టును కొట్టివేసింది. వారికి బెయిల్ మంజూరు చేసింది.
ఓ అవినీతికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎం3ఎం డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్ పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ 1న ఈడీ అధికారులు ఎం3ఎం గ్రూప్ కార్యాలయాలు, బన్సల్ సోదరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. దీంతో సోదరులిద్దరూ జూన్ 9న పంజాబ్–హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు జులై 5 వరకు వారికి వారిని అరెస్టు చేయొద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ జూన్ 14న వారిని ఈడీ అరెస్టు చేసింది.
ఈ అరెస్టును బన్సల్ సోదరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణ జరిపి వారిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఈడీ అధికారుల చర్యలపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
ఈడీ ప్రతి చర్య పారదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఈ కేసులో దర్యాప్తు సంస్థ తన అధికారాలను, విధులను అనుసరించడంలో ప్రమాణాలు పాటించలేదని తెలిపింది. ఈడీ ప్రతీకారపూరిత చర్యలకు పాల్పడకూడదని సూచించింది. అత్యంత పారదర్శకంగా, న్యాయంగా ఈడీ వ్యవహరించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
ఈడీ అడిగిన ప్రశ్నలకు నిందితులు సమాధానాలు చెప్పలేదన్న కారణంతో వారిని అరెస్టు చేయడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. మనీలాండరింగ్ చట్టం కింద వారు నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు ఉంటే అరెస్టు చేయొచ్చని పేర్కొంది. అంతేగానీ, సమన్లకు సరిగా స్పందించలేదని ఎవరినీ అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాకుండా అరెస్టు సమయంలో ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. అందుకు గల కారణాలను కూడా నిందితులకు లిఖితపూర్వకంగా వారికి తెలియజేయాల్సి ఉంటుంది అని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో బన్సల్ సోదరుల అరెస్టు చట్ట వ్యతిరేకమన్న ధర్మాసనం.. వారిని తక్షణమే విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది.