22 ఏళ్లలో 43 రోజులే కలిసి ఉన్న డాక్టర్ జంటకు సుప్రీం విడాకులు
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన ఇద్దరు వైద్యులకు 22 ఏళ్ల క్రితం పెళ్లైంది. అత్తగారింటికి వచ్చిన భార్యకు ఏదో నచ్చలేదు.
విడాకుల కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆసక్తికర తీర్పు ఇచ్చింది. ఓవైపు విడాకులు వద్దంటూ లేడీ డాక్టర్ కోరినా.. ఆమె మాటల్ని పట్టించుకోని సుప్రీం విడాకులు మంజూరు చేసింది. దీనికి కారణం తెలిస్తే.. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన ఇద్దరు వైద్యులకు 22 ఏళ్ల క్రితం పెళ్లైంది. అత్తగారింటికి వచ్చిన భార్యకు ఏదో నచ్చలేదు. అంతే.. తర్వాతి రోజే పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల పంచాయితీలు చాలానే జరిగాయి. అతి కష్టంగా 23 రోజులు కలిసి ఉన్నారు. అది కూడా వరుసగా కాదు. అప్పుడప్పుడు. కలిసి ఉన్న ప్రతిసారీ రెండు.. మూడు రోజులకే పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలో అనే వివాదాలు వచ్చాయి. భార్యభర్తలు ఇద్దరు పరస్పరం కేసులు పెట్టుకున్నారు.
భార్య పెట్టిన గృహహింస కేసుతో భర్త.. అతడి తల్లిదండ్రులు జైలుకు వెళ్లి వచ్చారు. ఈ పంచాయితీ అంతా ఎందుకు.. విడాకులు ఇవ్వాలని కోరుతూ కోర్టుకు వెళ్లాడు భర్త. 2006లో మీరట్ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే.. భార్య మాత్రం తనకు విడాకులు వద్దంటూ అప్పీలుకు హైకోర్టుకు వెళ్లింది. అలహాబాద్ హైకోర్టు మీరట్ కోర్టు ఇచ్చిన విడాకుల డిక్రీని క్యాన్సిల్ చేసింది. అయితే.. కాపురానికి రాని భార్య విడాకులు ఇవ్వకుండా వేధిస్తుందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్.. జస్టిస్ చంద్రశర్మల బెంచ్ విచారణ జరిపింది. 22 ఏళ్ల వారి వైవాహిక జీవితంలో 23 రోజులే కలిసి ఉండటం.. కోర్టు చెప్పిన కారణంగా మరో 20 రోజులే కలిసి ఉన్న విషయాన్ని సుప్రీం ప్రస్తావిస్తూ.. మొత్తంగా 43 రోజులే కలిసి ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావిస్తూ.. విడాకులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తనకు విడాకులు వద్దని.. భర్తతో కలిసి ఉంటామని భార్య చెప్పింది. ఆమె మాటలు నమ్మశక్యంగా లేవని.. గతంలో ఆమె ప్రవర్తనను చూస్తే నమ్మలేమని తేల్చింది.
"మీరిప్పుడు యాభైల్లోకి వచ్చారు. ఇప్పటికైనా మీ జీవితాలను మీరు స్వతంత్రంగా గడుపుకోండి. పెళ్లి చేసుకుంది గొడవ పడటానికే అన్నట్లు 22 ఏళ్లు కేసులతో కాలక్షేపం చేశారు" అంటూ సదరు జంటకు విడాకులు మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఎవరికి ఎవరు ఎలాంటి చెల్లింపులు అవసరం లేదని తేల్చింది.ఇద్దరు వైద్యులే కావటంతో ఎవరికి వారికి అవసరమైన ఆదాయం ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది. 22 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం 43 రోజులే కలిసి ఉండి కూడా విడాకులకు నో చెప్పే లేడీ డాక్టర్ వ్యవహారం వైరల్ గా మారింది.