ముస్లిం విద్యార్థిని కొట్టిన ఘటనపై సుప్రీం ఫైర్

ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తాజాగా, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2023-09-25 14:34 GMT

బీజేపీ హయాంలో దేశంలో మైనారిటీలపై, దళితులపై దాడులు పెరిగిపోయాయని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముస్లింలను, దళితులను మోడీ సర్కార్ టార్గెట్ చేసి హిందుత్వ రాజకీయాలను పెంచి పోషిస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. కొందరు వ్యక్తులు కూడా ఓ వర్గం ప్రజలను టార్గెట్ చేయడం వివాదాలకు దారితీసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థితో ఒక టీచర్ కొట్టించిన వైనం సంచలనం రేపింది.

దివ్యాంగురాలు అయినా ఆ టీచర్ తాను లేచి కొట్టలేక తోటి పిల్లాడితో ఆ స్టూడెంట్ ని కొట్టించానని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా పెను దుమారం రేగింది. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థుల మధ్య మతసామరస్యాన్ని పెంపొందించాల్సిన అధ్యాపకురాలు ఇలా ప్రవర్తిస్తే ఆ ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా ఉంటుందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తాజాగా, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో యూపీ పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరమని జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల ధర్మాసనం అభిప్రాయపడింది.

దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జవాబుదారీ వహించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఆ అధ్యాపకురాలిపై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే విధానం ఇదేనా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులపై కుల, మత ప్రాతిపదికన వివక్ష చూపడం విద్యాహక్కు చట్టం నిషేధించిందని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. బాధిత విద్యార్థికి కౌన్సిలింగ్ ఇప్పించాలని, అప్పుడే ఆ విద్యార్థి ఈ దుర్ఘటన తాలూకు ట్రామా నుంచి కోలుకోగలడని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సీనియర్ ఐపిఎస్ అధికారిని నియమించాలని మూడు వారాల సమయాన్ని గడువుగా విధించింది.

Tags:    

Similar News