ఇద్దరు మంత్రులు.. మూడు నియోజకవర్గాలు!

ఆంధ్రప్రదేశ్‌ లో మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2024-01-13 15:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు 50 అసెంబ్లీ స్థానాల్లో, 9 లోక్‌ సభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీట్లు నిరాకరించారు. మరికొందరిని ప్రస్తుతం ఉన్న చోట నుంచి వేరే చోటకు మార్చారు. ఇంకొందరు ఎంపీలను అసెంబ్లీ అభ్యర్థులుగా, ఎమ్మెల్యేలను లోక్‌ సభ అభ్యర్థులుగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో ఇద్దరు మంత్రులకు మూడు నియోజకవర్గాలు అవుతున్నాయి. ఇప్పటికే ఆ ఇద్దరు మంత్రులు రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా ఈసారి మళ్లీ కొత్త నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేశ్‌ తొలిసారిగా 2009లో కాంగ్రెస్‌ తరఫున ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో ఆదిమూలపు సురేశ్‌ నియోజకవర్గం మార్చారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. మళ్లీ 2019 ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం మార్చారు. తన పూర్వపు నియోజకవర్గం యర్రగొండపాలెం నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో మొదటి నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇక తాజాగా ఆదిమూలపు సురేశ్‌ కు వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గాన్ని కేటాయించారు. 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్‌ కొండెపి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో ఆయన మొత్తం మీద మూడు నియోజకవర్గాలు.. కొండెపి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం నుంచి పోటీ చేసినట్టు అవుతుంది.

అదేవిధంగా గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న జోగి రమేశ్‌ సైతం మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఆయన 2009లో తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున కృష్ణా జిల్లా పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయన పార్టీ, నియోజకవర్గం మార్చారు. వైసీపీలో చేరి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2019లో పెడన నియోజకవర్గానికి వచ్చిన జోగి రమేశ్‌ విజయం సాధించారు. జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకుని మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇప్పుడు జోగి రమేష్‌ కు సైతం జగన్‌ కొత్త స్థానాన్ని కేటాయించారు. కృష్ణా జిల్లా పెనమలూరు స్థానాన్ని ఆయనకు ఇచ్చారు. ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారధి టీడీపీలో చేరుతున్నారు. దీంతో పెనమలూరు సీటును జోగి రమేశ్‌ కు జగన్‌ కేటాయించారు. దీంతో జోగి రమేశ్‌ కు కూడా మూడు నియోజకవర్గాలు అవుతున్నాయి. పెడన, మైలవరం, పెనమలూరు నుంచి పోటీ చేసిన వ్యక్తిగా నిలవబోతున్నారు. ఈ మూడింటిలో పెడనలో మాత్రమే జోగి గెలుపొందారు. మైలవరంలో ఓడిపోయారు.

మరి కొత్త నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్‌ గెలుపొందగలరో, లేదో వచ్చే ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే. ప్రస్తుతం ఉన్న స్థానాల్లో వారిద్దరికీ గెలుపు అవకాశాలు లేవని ఐప్యాక్‌ సర్వే నివేదించడంతోనే జగన్‌ వారి స్థానాలను మార్చారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

Tags:    

Similar News