ఇదెక్కడి గోల.. కేంద్ర మంత్రి పదవి ఇస్తే వద్దంటున్నాడు!
వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 71 మందికి మంత్రులుగా చాన్సు దక్కింది
వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 71 మందికి మంత్రులుగా చాన్సు దక్కింది. కాగా ఈసారి కేరళలో కూడా బీజేపీ ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భించాక కేరళలో ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి. కేరళలోని త్రిస్సూర్ నుంచి ప్రముఖ సినీ నటుడు సురేశ్ గోపి బీజేపీ ఎంపీగా విజయం సాధించారు. గతంలో ఆయనను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే ఈ ఎన్నికల్లో త్రిస్సూర్ ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేసి సురేశ్ గోపి గెలుపొందారు.
ఈ నేపథ్యంలో వామపక్షాలు, కాంగ్రెస్ హవా చెలాయిస్తున్న కేరళలో బీజేపీ ఖాతా తెరవడానికి కారణమైన సురేశ్ గోపికి.. ప్రధాని మోదీ మంత్రివర్గంలో చాన్సు ఇచ్చారు. ఆయనను సహాయ మంత్రిగా నియమించారు. ఈ మేరకు సురేశ్ గోపి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే ఆయన మంత్రి పదవిపై ఆసక్తిగా లేకపోవడం గమనార్హం. ఈ మేరకు స్వయంగా సురేశ్ గోపినే వ్యాఖ్యలు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం సురేశ్ గోపీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘నాకు ఎంపీగా మాత్రమే పని చేయాలని ఉంది. నాకు మంత్రి పదవి అక్కర్లేదు. మంత్రి పదవిపై నాకు ఆసక్తి లేదని పార్టీకి చెప్పాను. త్వరలోనే తనను మంత్రి పదవి నుంచి రిలీవ్ చేస్తారని భావిస్తున్నాను’’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
‘‘త్రిసూర్ ప్రజలకు నేను బాగా తెలుసు. ఎంపీగా చాలా బాగా పనిచేస్తాను. అలాగే నాకు సినిమాల్లో నటించాలని ఉంది. పార్టీ నిర్ణయం తీసుకుని మంత్రిగా తప్పిస్తే నా పనులు నేను చేసుకుంటా’’ అని సురేశ్ గోపి వ్యాఖ్యానించారు.
వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో తనను గెలిపిస్తే త్రిస్సూర్ కు కేంద్ర మంత్రివర్గంలో పదవి లభిస్తుందని సురేశ్ గోపీ ప్రచారం చేశారు. దీన్ని నినాదంలా ఎత్తుకున్నారు. తనకు నటన అంటే ఇష్టమని.. సినీ రంగాన్ని విడిచిపెట్టబోనని తెలిపారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.
సురేశ్ గోపీ నటించిన దాదాపు అన్ని మళయాల సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ప్రధానంగా పోలీస్ ఆఫీసర్, సీఐడీ అధికారి తరహా పాత్రలకు సురేశ్ గోపీ పెట్టింది పేరు. తెలుగు నాట ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ కు అభిమానులున్నారు.
తనకు మంత్రిపదవి అంటే ఇష్టం లేదని.. ప్రధాని మోదీ ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని కోరారన్నారు. ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలన్నారని తెలిపారు. ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు తనకు ఫోన్ వచ్చిందన్నారు.
అయితే తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదన్నారు. కేరళ, తమిళనాడుల్లో బీజేపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని సురేశ్ గోపీ వెల్లడించారు.
కాగా మంత్రి పదవి దక్కనివాళ్లు దక్కక బాధపడుతుంటే.. ఇంకోవైపు మంత్రి పదవి లభిస్తే వద్దనడం సురేశ్ గోపీకే చెల్లింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆయన మంత్రి పదవి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.