ఆధ్మాత్మిక టూరిజం.. మార్కెట్ విలువ లెక్క చెప్పి షాకిచ్చిన రిపోర్టు
2025లో అంచనా వేసిన ఆధ్యాత్మిక మార్కెట్ విలువ 1,378 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.
రోటీన్ కు భిన్నంగా ఉండేలా చేయటంలో టూరిజం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టూరిజంలో నమ్మకాలతో ముడిపడి ఉండే ఆధ్యాత్మిక పర్యాటకం పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. విశ్వాసమే.. ఆ పర్యాటకానికి కీలకంగా మారుతుంది. వ్యక్తిగత సంపద పెరిగే కొద్దీ.. తీర్థయాత్రలు.. ఆధ్యాత్మిక అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఆధ్యాత్మిక మార్కెట్ ఎంత? అన్న ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే..గణాంకాలు అంత భారీగా ఉండటమే దీనికి కారణం.
2025లో అంచనా వేసిన ఆధ్యాత్మిక మార్కెట్ విలువ 1,378 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. మరో ఏడేళ్లకు.. అంటే 2032 నాటికి ఈ మార్కెట్ విలువ 2,260 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ట్రావెల్ టూరిజం వరల్డ్ రిపోర్టు చెబుతోంది. అంటే.. ఆధ్యాత్మిక పర్యాటకం సగటున 6.5 శాతం వార్షిక వ్రద్ధిని నమోదు చేస్తుందని చెప్పాలి. ఆధ్యాత్మిక టూరిజానికి ఇజ్రాయెల్.. సౌదీ అరేబియా.. భారతదేశంతో పాటు ఇటలీ లాంటి దేశాలు చాలా కాలంగా కేంద్రాలుగా ఉన్నాయి. ఆధ్యాత్మిక టూరిజనం శారీరక - మానసిక శ్రేయస్సుతో మిళితం చేసే వెల్ నెస్ టూరిజంగా మారుతోంది.
ఇప్పుడు అమెరికాతో పాటు కెనడాలోనూ స్థానిక ఆధ్యాత్మిక టూరిజం పెరుగుతోంది. వాషింగ్టన్ డీసీలోని బసిలికా ఆఫ్ ది నేషనల్ ష్రైన్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్షెప్షన్ కు తాకిడి పెరుగుతోంది. ఈ క్యాథిలిక్ చర్చికి భక్తుల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. యూరోప్ లోని స్పెయిన్.. ఇటలీ.. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో యూరోపియన్ నాగరికతను అన్వేషించటానికి వీలుగా పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి.
ఆసియా - పసిఫిక్ ప్రాంతానికి వస్తే భారత్ లో దేవాలయాలు.. పీఠాలు.. చర్చిలు.. మసీదుల్ని దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అమ్రత్ సర్ లోని స్వర్ణదేవాలయం.. చైనా - జపాన్ దేశాల్లో బౌద్దారామాలు లాంటి పవిత్ర స్థలాల్ని లక్షలాది మంది సందర్శిస్తున్నారు. అదే మధ్యప్రాచ్యం.. ఆఫ్రికా ప్రాంతాల్ని పరిగణలోకి తీసుకుంటే సౌదీ అరేబియా.. ఈజిఫ్టు.. ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మక్కా.. జెరూసలేం తీర్థయాత్రలు ఎంత ఎక్కువగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.