బాలరాముడికి "సూర్యతిలకం".. ఈ అద్భుత దృశ్యం ఎలా సాధ్యమైందంటే...?

ఈ సందర్భంగా ఆలయంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

Update: 2024-04-17 10:42 GMT

నేడు శ్రీరామనవమి కావడంతో ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య ఆలయంలో ఈసారి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధానంగా... ఈ ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో... శ్రీరాముడి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి!


అవును... బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బాలరాముడి నుదిటిపై సూర్య కిరణాలు పడేట్లు చేసిన ఏర్పాటు.. ఫలితంగా కనిపించిన అద్భుత దృశ్యం భక్తులను పరవశింపచేసిందనే చెప్పాలి. అధునాతన సాంకేతికత సాయంతో ఇది సాధ్యమైందని చెబుతున్నారు!


ఇందులో భాగంగా.. ఆలయం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటికోసం పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఇదే సమయంలో... ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతిని గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపుల ద్వారా కాంతి ప్రసరించి, విగ్రహం నుదిటిన తిలకంగా కన్పించింది.

ఈ సమయంలో సూర్యకిరణాలు.. గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం మాదిరిగా సుమారు 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. ఇలా ప్రతి శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడే కొన్ని కీలక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... ప్రతీ ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి! దీనికోసం శాస్త్రవేత్తలు గేర్‌ టీత్‌ మెకానిజంని ఉపయోగించారట!

అంటే... ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో ఏర్పాట్లు చేశారంట. ఇందులో భాగంగా... సూర్యకాంతిని గ్రహించే పరికరం దగ్గరే మరో పరికరం ఉంచిన శాస్త్రవేత్తలు.. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉండే ఏర్పాట్లు చేశారంట. దీనికోసం ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారని చెబుతున్నారు.

ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుందని.. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీ.బీ.ఆర్‌.ఐ) శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా నిర్మించారు.

Tags:    

Similar News