'సూపర్ స్లిమ్' 360 డిగ్రీస్ ప్లేయర్.. సర్జరీ తర్వాత 15 కిలోల బరువు లెస్

టీమిండియా టి20 ప్రపంచ కప్ వేటను మొదలుపెట్టింది. శనివారం బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో చెలరేగి ఆడి గెలిచింది

Update: 2024-06-02 06:29 GMT

టీమిండియా టి20 ప్రపంచ కప్ వేటను మొదలుపెట్టింది. శనివారం బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో చెలరేగి ఆడి గెలిచింది. అసలు సమరంలో భాగంగా ఈ నెల 5న ఐర్లాండ్ తో తలపడనుంది. 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఢీకొననుంది. కాగా, శనివారం జరిగిన మ్యాచ్ లో ఓ ప్లేయర్ మాత్రం అందరినీ తనవైపు చూసేలా చేశాడు. క్రీజులో చురుగ్గా కదులుతూ.. మైదానంలో చక్కటి ఫీల్డింగ్ తో కనిపించాడు.

అతడు ఇతడేనా?

టీమిండియా టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఫిట్ గా మారాడు. భారత్ కు ఈ ప్రపంచ కప్ లో అతడు అత్యంత కీలక ఆటగాడు అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా గత రెండు కప్ ల కంటే. వన్డే ప్రపంచ కప్ అనంతరం చీలమండ గాయంతో ఇబ్బందిపడిన సూర్య దానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తర్వాత స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిం. దీంతో బరువు పెరిగాడు. అయితే, ప్రపంచ కప్‌ ను దృష్టిలో పెట్టుకుని 15 కిలోల బరువు తగ్గాడు. దీనికోసం కఠినమైన ఆహార నియమాలను పాటించాడు. మరోవైపు సూర్య దాదాపు నాలుగు నెలల పాటు మైదానానికి దూరమయ్యాడు. అప్పుడు పెరిగిన బరువును తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లాడు.

కసరత్తులు.. ప్రత్యేక డైట్

వరుసగా రెండు సర్జరీల తర్వత సూర్య.. బరువు తగ్గేందుకు కసరత్తులు చేశాడు. కఠిన ఆహార నియమాలతో ప్రత్యేక డైట్ పాటించాడు. ఇందులో భాగంగా అన్నం మొత్తానికే తినలేదు. గోధుమలతో కాకుండా ఇతర పిండితో చేసిన రొట్టెలు తీసుకున్నాడు. ప్రోటీన్లు అధికంగా లభించే గుడ్లు, మాంసం, చేపలను ఆహారంలో భాగం చేసుకున్నాడు. అసలు పాల ఉత్పత్తుల జోలికే వెళ్లలేదు. కూరగాయలు, నట్స్, అవకాడోలను తీసుకున్నాడు.

బక్కగా.. బలంగా.. కండలతో..

ఇటీవల ఐపీఎల్ ద్వారా సూర్య తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అప్పటికీ, ఇప్పటికీ ఇంకా బరువు తగ్గాడు. కాస్త సన్నగా, మరింత బలంగా, కండలతో కనిపిస్తున్నాడు. వాస్తవానికి రెండు వరుస సర్జరీలు కావడంతో మందుల కారణంగా సూర్య బరువు పెరిగాడు. ఇప్పుడు అందులోంచి 15 కిలోలు తగ్గాడు. ఇందులో 13 కిలోలు కొవ్వే కావడం గమనార్హం.

Tags:    

Similar News