ఎమ్మెల్సీ వర్మ... ఎంతో దూరం లేదా ?
అయితే గడచిన ఎనిమిది నెలలలో చాలా ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయిపోయాయి. కానీ వర్మ విషయం అలాగే ఉండిపోయింది.
గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గం అయిన పిఠాపురాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేసి ఏడాదిలో మూడు వందల అరవై రోజులూ పార్టీ కోసం పనిచేసే నేతగా టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు పేరు ఉంది. ఆయన 2009 నుంచి వరసగా పోటీ చేస్తూ వచ్చారు. మధ్యలో 2014లో ఇండిపెండెంట్ గా తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీని సాధించారు.
ఇక 2024లో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవాలని వర్మ అయిదేళ్ళూ కష్టపడి పనిచేశారు. కానీ జనసేనకు ఆ సీటు పొత్తులో భాగంగా వెళ్ళడం, చివరి నిముషంలో ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో వర్మకు భారీ షాక్ తగిలింది. ఆయన ఒక దశలో క్యాడర్ మాట విని ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అయిపోయారు.
అయితే టీడీపీ అధినాయకత్వం ఆయనను బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. మొత్తానికి ఆయన పవన్ కళ్యాణ్ గెలుపునకు మనస్పూర్తిగా పనిచేసి భారీ మెజారిటీ దక్కడానికి ఎంతో కృషి చేశారు. ఇక ఆయనకు టీడీపీ హైకమాండ్ నుంచి అపుడు భారీ హామీ దక్కిందని ప్రచారంలో ఉంది. తొలి నామినేటెడ్ పదవి వర్మకే అన్ భరోసా ఇచ్చారని కూడా చెప్పుకున్నారు.
అయితే గడచిన ఎనిమిది నెలలలో చాలా ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయిపోయాయి. కానీ వర్మ విషయం అలాగే ఉండిపోయింది. ఆయన అనుచరులు అభిమానులలో అయితే నిరాశ పడుతున్నారు. తమ నాయకుడికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇక వర్మ అయితే అనేకసార్లు చంద్రబాబు లోకేష్ బాబులను కలసి వచ్చారు.
మరి ఇపుడు చూస్తే గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకి ఎన్నికలు వచ్చాయి. ఈ కీలక సమయంలో వర్మకు ఈ సీటు కేటాయించాలని కూడా ఒక డిమాండ్ అయితే ఉంది. ఇపుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎవరిని ప్రకటించినా బాజాభజంత్రీలతో భారీ మెజారిటీతో గెలుస్తారు. పైగా ఆరేళ్ళ పాటు పెద్దల సభలో ఉంటారు.
మరి ఈ పదవికి కూటమి అభ్యర్ధిగా వర్మ పేరుని ప్రకటిస్తే సహేతుకంగానూ సమంజసంగానూ ఉంటుందని అంటున్నారు. అంతే కాదు పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం దక్కిందని అంతా భావిస్తారు అని అంటున్నారు. వర్మకు ఈసారి అయినా చాన్స్ ఇస్తారా ఆయన రాజకీయ అదృష్టాన్ని మలుపు తిప్పుతారా అన్నది మాత్రం పిఠాపురంలో పెద్ద ఎత్తున చర్చగా ఉంది.
అయితే పట్టభద్రుల సీటుకు అభ్యర్థి ఖరారు అయిపోయారని అంటున్నారు. చాలా కాలం క్రితమే పట్టభద్రులను చేర్పించుకుని పక్కాగా గెలిచే వ్యూహాలను అమలు చేసుకుంటూ పోతున్నారని కూడా చెబుతున్నారు. వర్మ విషయంలో అయితే కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అని అంటున్నారు.
ఎమ్మెల్సీ పదవులు పది దాకా మార్చి నెలాఖరులో ఖాళీ అవుతున్నాయని అందులో ఒక దానికి వర్మకే రిజర్వ్ చేశారని గట్టిగా రెండు నెలలు కూడా లేదని వర్మ ఎమ్మెల్సీ కావడం ఖాయమని కూడా అంటున్నారు. ఏది ఏమైనా పిఠాపురం వర్మకు పదవి ఇస్తే తమకు దక్కినట్లుగానే భావించాలని చాలా మంది అనుకుంటున్నారు. మరి ఎమ్మెల్సీ వర్మ అని పిలిచే రోజు ముందుందా అది ఎపుడు వస్తుంది అన్నది చర్చగానే ఉంది. చూడాలి మరి ఆ లక్కీ చాన్స్ వర్మ గారికి ఎపుడో.