Begin typing your search above and press return to search.

విశాఖ పీఠానికి సెలవంటూ స్వామి ...?

పీఠానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ అనేక సార్లు రావడంతో కూటమికి రాచ కళ వచ్చింది. స్వామి స్వరూపానందేంద్ర రాజ గురువుగా మారిపోయారు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 3:00 AM GMT
విశాఖ పీఠానికి సెలవంటూ స్వామి ...?
X

విశాఖ అంటే గుర్తుకు వచ్చేవి ఎన్నో ఉన్నాయి. అందులో విశాఖలోని శారదాపీఠం కూడా ఉంది. మూడు దశాబ్దాల క్రితం చిన్నగా ప్రారంభం అయిన ఈ పీఠం ఆ తరువాత దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందింది. ప్రధానంగా రాజకీయ భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆశ్రమానికి రావడంతో అందరి దృష్టిలో పడింది.

ఉమ్మడి ఏపీలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పీఠానికి ఎక్కువగా కాంగ్రెస్ పెద్దలు వచ్చేవారు. ఇక 2019లో వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చాక పీఠంలో మళ్లీ కొత్త కళ వచ్చింది. పీఠానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ అనేక సార్లు రావడంతో కూటమికి రాచ కళ వచ్చింది. స్వామి స్వరూపానందేంద్ర రాజ గురువుగా మారిపోయారు.

ఒక దశలో ఆయన హవా చాలా ఎక్కువగా నడచింది. పీఠానికి ఒక మాట చెబితే ప్రభుత్వంలో పని జరుగుతుందని భావించిన వారు ఎక్కువ కావడంతో పీఠానికి వెల్లువలా క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక జగన్ స్వామీజీ మాట వింటారు అన్నది ప్రచారం కావడం తో కూడా అక్కడ హడావుడి ఎక్కువ అయింది.

ఈ క్రమంలో విశాఖ జిల్లా భీమిలీ వద్ద ఏకంగా పదిహేను ఎకరాల ఖరీదైన భూమిని వేద విశ్వవిద్యాలయం కోసం పీఠానికి వైసీపీ ప్రభుత్వం స్వామీజీ అడగడమే తరువాయి అన్నట్లుగా ఇచ్చేసింది. అది కూడా ఎకరానికి కేవలం లక్ష అంటూ నామమాత్రం ధరతో కట్టబెట్టారు. ఆ తరువాత దానికి వాణిజ్య కార్యక్రమాలను ఉపయోగించుకుంటామని పీఠం అర్జీ పెట్టుకుంటే దానికి కూడా వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తుందని రావాలని పీఠంలో రాజశ్యామల హోమాన్ని కూడా చేపట్టారు. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవని అన్నట్లుగా తెలంగాణాలో కేసీఆర్ ఓటమి ఒక దెబ్బ అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలు కావడం మరో దెబ్బ అని అంటున్నారు.

దాంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నేతలు పీఠాన్ని టార్గెట్ చేశారు. ఇంతకాలం వైభోగం కాస్తా ఇపుడు ఇక ఫ్లాష్ బ్యాక్ గా మారింది. కొందరు నేతలు ఢిల్లీ దాకా వెళ్ళి రాష్ట్రపతికి సైతం విజ్ఞప్తి చేసి వచ్చారు. పీఠం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ఇంకో వైపు శారదా పీఠానికి ఇచ్చిన పదిహేను ఎకరాల భూములను తీసుకోవాలని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోనని ప్రచారం మొదలైంది. ఈ మొత్తం పరిణామాలతో పీఠం వైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఇక విశాఖలో ఉండడం కంటే హైదరాబాద్ కి షిఫ్ట్ అవడం బెటర్ అని స్వామీజీ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

అక్కడ కేసీఆర్ సీఎం గా ఉన్నపుడు రెండున్నర ఎకరాల స్థలాన్ని పీఠం కట్టుకోవడానికి ఇచ్చారు. దాంతో అక్కడికి స్వామి వెళ్తారు అని అంటునారు. స్వామీజీ జన్మదినం నవంబర్ నాలుగున నాగుల చవితి వేళ వస్తుంది. అప్పటివరకూ పీఠంలో ఉండి ఆ మీదట తెలంగాణాలో పీఠానికి వెళ్లాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నా ఏపీలో అంతగా టార్గెట్ చేసేది ఉండదని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాంతో తెలంగాణా అన్ని విధాలుగా బెటర్ అని పీఠాధిపతులు ఆలోచిస్తున్నారు అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే పీఠంలో ఎన్నో దేవీ దేవతల ఆలయాలు ఉన్నాయి . సాధారణ భక్తులు పెద్ద ఎత్తున గతంలో వచ్చేవారు. ఎపుడైతే రాజకీయ హడావుడి మొదలైందో వారికి ఆంక్షలు పెట్టి దూరం పెట్టారు. దాంతో గతంలో పీఠానికి వచ్చిన వారు కూడా తగ్గిపోయారు.

ఆధ్యాత్మికం గొప్పది. అది ఇహానికి చెందనిది పరానికి ఒక వారధి లాంటిది అంతటి ఉన్నతమైన పీఠంలో ఉంటూ రాజకీయంగా వ్యవహరించారు ఒక పార్టీకి కొమ్ము కాశారు అన్న పేరు రావడంతోనే ఇపుడు ఈ విధంగా పీఠానికి దుస్థితి వచ్చిందని అంటున్నారు. రాజకీయాలను జొప్పిస్తే ఇలాగే ఉంటుందని అంటున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి. వైషమ్యాలు ఉంటాయి. వీటికి అతీతంగా ఉండాల్సిన స్వాములు ఈ వైపుగా వస్తే ఇక ఆశ్రమాలకు పీఠాలకు భక్తులు అనే వారు ఎందుకు వస్తారని కూడా అంటున్నారు.