ఏపీలో స్వామితో బీజేపీ పాలిటిక్స్...!?
బీజేపీ అంటే సనాతన ధర్మాన్ని పాటించే పార్టీగా పేరు. పైగా హిందూత్వ సిద్ధాంతాలను ఎక్కువగా నమ్మిన పార్టీగా ఉంది
బీజేపీ అంటే సనాతన ధర్మాన్ని పాటించే పార్టీగా పేరు. పైగా హిందూత్వ సిద్ధాంతాలను ఎక్కువగా నమ్మిన పార్టీగా ఉంది. అలాంటి బీజేపీలో స్వాములు యోగులు కూడా ఎక్కువగానే ఉంటారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ రెండవసారి గెలిచి మరీ అతి పెద్ద రాష్ట్రంలో కమల వికాసానికి కృషి చేస్తున్నారు.
ఇపుడు ఏపీలో అలాంటి ఫార్ములానే బీజేపీ అమలు చేస్తోందా అంటే ఆసక్తికరమైన విషయాలే బయటకు వస్తున్నాయి. బీజేపీ అంటే ఎంతో ఇష్టపడే స్వామీజీ పరిపూర్ణానంద స్వామిని వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ఆ పార్టీ భారీ ప్లాన్ లో ఉంది అని అంటున్నారు.
ఇంతకీ పరిపూర్ణానంద స్వామి ఎవరు అంటే ఆయన కాకినాడకు చెందిన మఠాధిపతిగా ఉన్నారు. ఆయన 2014లో బీజేపీకి ఎంతో ప్రచారం నిర్వహించారు. ఆయన అప్పట్లో హెలికాప్టర్ల ద్వారా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో తిరిగి బీజేపీకి ప్రచారం చేశారు. ఆయన పేరు అప్పట్లో తెలంగాణా సీఎం అభ్యర్ధిగా వినిపించింది.
ఆ తరువాత ఆయన రాజకీయాలకు దూరం జరిగారు. బీజేపీ కూడా పట్టించుకోలేదు. ఇపుడు ఆ స్వామిని బీజేపీ మళ్లీ యాక్టివ్ చేయాలని చూస్తోంది అని అంటున్నారు. ఆయన కూడా బీజేపీ అవకాశం ఇస్తే రాజకీయంగా తన వంతు పాత్ర నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
ఆయనను హిందూపురం నుంచి ఎంపీ గా బీజేపీ తరఫున పోటీ చేయిస్తే ఆధ్యాత్మికత ప్లస్ రాజకీయ అనుకూలతలు ఇంకా ఇతర సామాజిక వర్గ పరిస్థితులు అన్నీ కలసి విజయం దక్కించేలా చేస్తాయి అని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు బీజేపీ పెద్దల నుంచి స్వామీజీకి వర్తమానం అందినట్లుగా ప్రచారం సాగుతోంది.
ఆయన అమిత్ షాకు సన్నిహితుడు అని పేరు. దాంతో ఈ మొత్తం వ్యవహారం అమిత్ షాయే చూస్తున్నారు అని అంటున్నారు. ఈసారి ఏపీలో కనీసంగా ఎనిమిది నుంచి పది ఎంపీ సీట్లను పొత్తులో తమకు వదిలేయమని బీజేపీ కోరుతోంది అని అంటున్నారు. అలా వచ్చిన సీట్లలో కీలకమైన నాయకులను దించాలని చూస్తోంది అని తెలుస్తోంది. ఆ జాబితాలో స్వామీజీ ఉన్నారని అంటున్నారు.
పరిపూర్ణానంద స్వామీజీతో ఏపీలో బీజేపీ తన పొలిటికల్ ట్రేడ్ మార్క్ ని ప్రయోగించాలని చూస్తోంది అని అంటున్నారు. ఇటీవల రామమందిరం ప్రారంభంతో బీజేపీ ఒక విధంగా హిందువులలో మంచి పాజిటివిటీని సంపాదించుకుంది. దాంతో దానికి మరింత కనెక్ట్ అయ్యేలా స్వామీజీ లాంటి వారిని రంగంలోకి దించితే ఫ్యూచర్ లో ఏపీలో బీజేపీ పూర్తి స్థాయిలో పాగా వేయడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. చూడాలి మరి ఈ రకమైన ఎత్తుగడలు ఎంతవరకూ సక్సెస్ ని ఇస్తాయో.