అనుమానాలు... ''ఆ ఈవీఎం''లు తెరవగానే లెక్క మారిందంటున్న నటి!
ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలన్నీ భారతీయ జనతాపార్టీ వైపే వేళ్లు చూపిస్తున్నాయని అంటున్నారు!
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా వెలువడిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వరకూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) లపై సంచలన ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలన్నీ భారతీయ జనతాపార్టీ వైపే వేళ్లు చూపిస్తున్నాయని అంటున్నారు!
ఈ సందర్భగా వారు చేసే ఆరోపణలకు చూపించే ఆధారాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి! ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈవీఎం మెషిన్స్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అనుశక్తి నగర్ ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి ఫహద్ అహ్మద్ భార్య, నటి స్వర భాస్కర్.
అవును... తన భర్త ఫహద్ అహ్మద్ మహారాష్ట్రలోని అనుశక్తి నగర్ నియోజకవర్గంలో అనేక రౌండ్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నప్పటికీ.. వెనుకంజ వేయడం ప్రారంభిచడానికి గల కారణాలు ఇవే అంటూ నటి స్వర భాస్కర్ ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఈ సందర్భంగా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఉండటంపై ప్రశ్నించారు.
ఈ సందర్భంగా స్పందించిన స్వర భాస్కర్... 99% ఛార్జ్ తో ఉన్న ఈవీఎంలను తెరిచే వరకూ ముంబైలోని అనుశక్తి నగర్ సీటులో ఫహద్ అహ్మద్ ఆధిక్యంలో ఉన్నారని ఆమె తెలిపారు. అయితే... 17, 18, 19 రౌండ్లలో 99% బ్యాటీ ఛార్జ్ ఉన్న ఈవీఎంలు తెరవబడ్డాయని.. వెంటనే లెక్కలు మారిపోయాయని తెలిపారు.
ఇందులో భాగంగా... ఆ ఈవీఎంలను ఓపెన్ చేయగానే బీజేపీ మద్దతు ఉన్న ఎన్సీపీ (అజిత్ పవార్) అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చేశారని ఆమె చెప్పారు. ఒక రోజు మొత్తం ఓటు వేసినా కూడా మెషిన్లు 99% ఛార్జ్ చేయబడిన బ్యాటరీలు అన్నీ బీజేపీ, దాని మిత్రపక్షాలకే ఎందుకు ఓట్లు ఇస్తాయని ప్రశ్నిస్తూ ఈసీ, మహా వికాస్ అఘాడీ అగ్రనేతలను ట్యాగ్ చేశారు.
ఇదే సమయంలో... 17వ రౌండ్ వరకూ తాను ఆధిక్యంలో ఉన్నానని.. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తానని అహ్మద్ ట్వీట్ చేశారు. దీంతో.. మరోసారి ఈవీఎంల వ్యవహారంపై చర్చ మొదలైందని అంటున్నారు.