మందులు.. పిల్లల ఫుడ్ దాచుకోండి.. ప్రశాంత దేశాల్లో ప్రపంచ యుద్ధ భయం
యుద్ధం అంటే ఏమిటో..? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియని ప్రశాంత దేశాలవి.. అలాంటివాటికి రెండున్నరేళ్ల కిందట భయం మొదలైంది
యుద్ధం అంటే ఏమిటో..? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియని ప్రశాంత దేశాలవి.. అలాంటివాటికి రెండున్నరేళ్ల కిందట భయం మొదలైంది.. శతాబ్దాల తరబడి ఏ సైనిక కూటమిలోనూ లేని ఆ దేశాలు వెన్నులో వణుకుతో ‘నాటో’ శరణు కోరాయి.. ఇప్పుడు వాటికి మరింత భయం పట్టుకుంది.. ఒకవేళ యుద్ధమే జరిగితే ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో సూచిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడు. అవే స్కాండినేవియన్ దేశాలు.
సంతోషానికి చిరునామా..
ఫిన్లాండ్.. ప్రపంచంలోనే సంతోషకర దేశాల్లో ఒకటి. స్వీడన్ కూడా దాదాపు అలాంటిదే. ఇరుగుపొరుగు. వీటిని స్కాండినేవియన్ దేశాలు అంటారు. అయితే, రష్యాతో యూరప్ లోనే అత్యంత సుదీర్ఘ సరిహద్దు (1,340 కిలోమీటర్లు) కలిగి ఉంది ఫిన్లాండ్. స్వీడన్ కు రష్యాకు మధ్య 15 కిలోమీటర్ల సరిహద్దే ఉన్నప్పటికీ.. బాల్టిక్ సముద్రం కారణంగా అత్యంత కీలకమైనది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచి ఈ రెండు దేశాలు కలవరం చెందుతున్నాయి.
హడావుడిగా నాటోలో చేరిక
స్వీడన్ 250 ఏళ్లుగా ఏ సైనిక కూటమిలోనూ లేదు. ఫిన్లాండ్ కూడా నాటోలో దాదాపు 80 ఏళ్లుగా చేరలేదు. కానీ, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో పొలో మంటూ నాటోలోకి వచ్చేశాయి. ఈ కూటమిలోని ఒక్క దేశంపై దాడి జరిగినా అది నాటో కూటమిపై దాడిగానే భావిస్తారు. కూటమి మొత్తం స్పందిస్తుంది. అందుకని తమ రక్షణ కోసం నాటోలో చేరాయి. 2023 ఏప్రిల్ లో ఫిన్లాండ్, 2024 మార్చిలో సభ్య దేశాలయ్యాయి.
బహుపరాక్..
తాజాగా రష్యాపై లాంగ్ రేంజ్ క్షిపణులతో దాడికి ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వడంతో ఫిన్లాండ్, స్వీడన్ వణికిపోతున్నాయి. నాటో కూటమి దేశాల్లోనూ ఈ నిర్ణయం ప్రకంపనలు రేపుతోంది. దీంతో అవి తమ ప్రజలను యుద్ధానికి మానసికంగా సిద్ధం చేస్తున్నాయి. ఆ సమయంలో ఏం చేయాలనే అంశాలతో బుక్‌లెట్లు పంచుతున్నాయి. స్వీడన్, ఫిన్లాండ్ ఇలా లక్షల బుక్ లెట్లను పంచిపెట్టాయి. యుద్ధాల వేళ, కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు, విద్యుత్తు పోతే ఎలా స్పందించాలి? వంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయి.
అన్నీ దగ్గర పెట్టుకోండి..
యుద్ధం మొదలైతే మౌలిక అవసరాలైన మంచి నీరు, ఆహారం, ఇతర పదార్థాలను నిల్వ ఉంచుకోవాలని స్వీడన్, ఫిన్లాండ్ కోరాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలా? అనేది ప్రజలకు తెలియజెప్పడం దీని ఉద్దేశం. చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులు కచ్చితంగా డైపర్స్, ఔషధాలు, ఆహారం నిల్వ ఉంచుకోవాలని సూచించాయి. ‘యుద్ధమే వస్తే’ అంటూ స్వీడన్ ప్రభుత్వం 50 లక్షల బుక్ లెట్లను రెండు వారాల్లో పంచనుంది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇలా పంచడం ఇది ఐదోసారి. సోమవారం 55 వేలమంది వీటిని డౌన్ లోడ్ చేసుకొన్నారు. ప్రపంచంలో పరిస్థితి కొన్నేళ్లుగా మారుతోందని.. మన సమీపంలోనే యుద్ధం జరుగుతోందని హెచ్చరించింది.
ఫిన్లాండ్ సైతం ఇలాంటి కరపత్రాలనే ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చింది. 58 శాతం ప్రజలు యుద్ధం వస్తే తట్టుకొనేందుకు అత్యవసర సామగ్రిని నిల్వ చేసుకున్నారట. మరో స్కాండినేవియన్ దేశం నార్వే సైతం 22 లక్షల బుక్ లెట్లను ఇంటింటి పంచింది.