గోడ దూకేందుకు సిద్ధం అవుతున్న మాజీమంత్రి?.. అప్రమత్తమైన కేసీఆర్!

బీఆర్ఎస్‌లో కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గోడ దూకేందుకు సిద్ధపడుతున్నారు అన్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Update: 2025-01-24 14:30 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఏ నేత ఎప్పుడూ ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఈరోజు ఈ పార్టీలో ఉన్న నేత మరో రోజు మరో పార్టీ కండువాతో కనిపిస్తున్నారు. అధికారమే పరమావధిగా భావిస్తుండడంతో ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు తమ నాయకులను కాపాడుకునేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన భారతీయ రాష్ట్ర సమితి ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించింది. ఒకానొక సమయంలో తెలంగాణలో ప్రజాపక్షంగా నిలబడి వాయిస్ వినిపించే బలమైన నాయకులు లేకుండా పోయారు. అయితే రాజకీయాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు. కాలం మారింది.

రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఇప్పుడు తమ పార్టీకి చెందిన నేతలను కాపాడుకోవాల్సిన స్థితికి బిఆర్ఎస్ చేరిపోయింది. గడిచిన ఎన్నికల్లో గెలిచిన ఎంతోమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఉన్న కీలక నేతలను కాపాడుకునేందుకు కేసిఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ సర్వశక్తులూ వడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏ నేత పార్టీ మారుతారో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నేత పార్టీ మారతారన్న చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్‌లో కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గోడ దూకేందుకు సిద్ధపడుతున్నారు అన్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బిఆర్ఎస్ అంతర్గత చర్చల్లోనూ ప్రస్తుతం ఇదే టాపిక్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలోని సనత్‌నగర్ నియోజకవర్గ నుంచి వరుసగా విజయాలు దక్కించుకుంటూ వస్తున్న ఆయన భారతీయ రాష్ట్ర సమితి హయాంలో మంత్రిగానూ చక్రం తిప్పారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తలసాని పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించడం లేదు. దీంతో తలసాని పార్టీ మారుతారు అన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

వాస్తవానికి కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసులు నమోదైనప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్దగా స్పందించలేదు. అప్పటికే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు నేపథ్యంలోనే ఆయన స్పందించలేదన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన పార్టీలో యాక్టివ్‌గా లేకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా చెబుతున్నారు. గతంలో ఆయన టిడిపిలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో టిడిపికి భవిష్యత్తు లేదని గుర్తించి భారతీయ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. అయితే చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఆయన మళ్ళీ తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తెలుగుదేశంలో చేరడం ద్వారా కీలక నేతగా ఉండవచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ మారితే తెలంగాణ టిడిపి పగ్గాలు తనకు దక్కుతాయని భావిస్తున్న తలసాని.. అందుకు అనుగుణంగానే సైలెంట్ గా చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ దృష్టికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికిప్పుడు తలసాని వ్యవహారంలో స్పందించకూడదని కెసిఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సమయం వచ్చినప్పుడు దీనిపై స్పందించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారకుండా ఉండేందుకు అనుగుణంగా కేసీఆర్ మాటగా తలసానితో సన్నిహితంగా ఉండే కొందరు నేతలతో రాయబారాన్ని పంపించినట్లు చెబుతున్నారు. వారితో మాత్రం తాను పార్టీ మారడం లేదని తలసాని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అంతర్గతంగా ఆయన సాగిస్తున్న ప్రయత్నాలు విషయం కెసిఆర్ దృష్టికి వచ్చిందని ఆ పార్టీ వర్గాల బోగట్టా. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారతీయ రాష్ట్ర సమితిలో ఉంటారా? గోడ దూకి తెలంగాణ తెలుగుదేశానికి ఆయువు పోసేందుకు సంసిద్ధులవుతారా? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News