ఆ ప్రాజెక్టు అమలు చేస్తే ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేస్తా!
అటు సీఎం స్టాలిన్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టంగ్‌స్టన్ ప్రాజెక్టు అమలైతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ మైనింగ్ పనులు జరగనిచ్చేదే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడాన్ని ఆయన ఖండించారు. దీంతో స్టాలిన్ నిర్ణయం ఇప్పుడు పార్టీల వారీగా చర్చకు దారితీసింది.
మధురై జిల్లా మేలురు సమీపంలో టంగ్‌స్టన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిని ఖండిస్తూ సోమవారం అసెంబ్లీలో నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్ ఓ ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా అన్ని పార్టీల సభ్యులు సైతం ఆ ప్రాజెక్టును అనుమతించకూడదని డిమాండ్ చేశాయి. అటు సీఎం స్టాలిన్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టంగ్‌స్టన్ ప్రాజెక్టు అమలైతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సైతం ఈ అంశంపై మాట్లాడారు. పది నెలల క్రితమే టంగ్‌స్టన్ సొరంగం తవ్వకాలకు వేలం పాట జరిగిందని, అయినా డీఎంకే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించిందని విమర్శించారు. సమస్య తీవ్రరూపం దాల్చిన తర్వాత ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారని, ఇది ప్రజల ప్రధాన సమస్య అని అన్నారు. టంగ్‌స్టన్ తవ్వకాలకు వేలం జరిగిన పది నెలలపాటు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందో ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన ప్రత్యేక తీర్మానాన్ని అన్నాడీఎంకే సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తారని చెప్పారు.
మరోవైపు.. ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. టంగ్‌స్టన్ సొరంగం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. తాను కూడా కేంద్రానికి లేఖ రాశానని వివరించారు. పార్లమెంటులోనూ డీఎంకే ఎంపీలు సభను స్తంభింపజేసేలా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ ప్రాజెక్టు వివరాలు బయటకు వచ్చినప్పుడే తమ పార్టీ సభ్యులంతా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. టంగ్‌స్టన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని, అనుమతించేదే లేదని అన్నారు. తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఈ ప్రాజెక్టుకు పర్మిషన్ ఉచ్చే ప్రసక్తే లేదని అన్నారు.