మోదీని ఢీ కొడుతున్న తమిళ ‘బాషా’..

సరిగ్గా 30 ఏళ్ల కిందట విడుదలైంది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘బాషా’ సినిమా. మొదట సాదాసీదా సినిమా అనుకున్నా.. తెలుగులోనూ దుమ్మురేపింది

Update: 2025-02-25 23:30 GMT

సరిగ్గా 30 ఏళ్ల కిందట విడుదలైంది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘బాషా’ సినిమా. మొదట సాదాసీదా సినిమా అనుకున్నా.. తెలుగులోనూ దుమ్మురేపింది. రజనీ నోటి నుంచి వచ్చిన ఒక్కో డైలాగ్ ఒక్కో తూటాలా పేలాయి. ఇప్పటికీ ‘బాషా’ అంటే ఓ ట్రెండ్ సెట్టర్. అయితే, అది సినిమాల్లో.. కానీ, రాజకీయాల్లోనూ ఓ ‘బాషా’ ఇప్పుడు చర్చనీయం అవుతున్నారు.

‘ముత్తువేల్ కరుణానిధి’.. భారత రాజకీయాల్లో ఈయనది చెరగని ముద్ర. తమిళనాడు ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేసిన కరుణ.. పక్కా తమిళవాది. హిందీ వ్యతిరేకి. ఆయన హయాంలోనే హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళ గడ్డపై తీవ్రంగా సాగింది. ఒకరకంగా కరుణ రాజకీయ పునాదులను పటిష్ఠం చేసింది.

ఇప్పటి విషయానికి వస్తే కరుణానిధి రాజకీయ వారసుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ‘భాష’నే తన రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ ను వ్యతిరేకించడం గానీ.. మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ను తిప్పికొట్టడంలోగానీ స్టాలిన్ ఎక్కడా తగ్గడం లేదు.

భావోద్వేగాన్ని రెచ్చగొట్టేలా..

తమిళులకు భాషాభిమానం చాలా ఎక్కువ. హిందీ మీద వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే స్టాలిన్ ప్రభుత్వం ఎన్ఈపీని అమలు చేసేది లేదని కుండబద్దలు కొడుతోంది. ఎన్ఈపీ ద్వారా హిందీని బలవంతంగా తమపై రుద్దడమే కేంద్రం ఉద్దేశం అని స్టాలిన్ తమిళుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు.

జనాభా నియంత్రణ పాటించినందుకు.. నియోజకవర్గాల పునర్విభజనలో లోక్ సభ సీట్లు తగ్గుతున్న వైనాన్ని కూడా స్టాలిన్ రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారు.

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విపరీతమైన అభిమాన గణం ఉన్న స్టార్ హీరో విజయ్ ఇటీవల సొంతంగా తమిళగ వెట్రి కళగం పేరిట పార్టీని స్థాపించి దూకుడుగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ముందుగానే అప్రమత్తం అయ్యారు. విజయ్ కారణంగా ఇబ్బంది లేకుండా తమ పునాదులను పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే తమ పార్టీ డీఎంకే మూలాల్లోకి వెళ్తున్నారు. హిందీ వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని.. తమిళ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల సముద్రాన్ని ఈదాలంటే ఏదో ఒక సాహసం తప్పదనేది స్టాలిన్ ఆలోచనగా ఉంది. అందుకే.. తమిళ ‘బాషా’గా ఏకంగా మోదీని ఢీకొడుతున్నారు.

Tags:    

Similar News