జూనియర్...పవన్... చంద్రబాబు...తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!

టీడీపీ రాజకీయాల మీద తమ్మారెడ్డి ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.

Update: 2023-10-03 11:54 GMT

జూనియర్ ఎన్టీయార్ ఇంటి మనిషి. ఆయనను దూరం పెట్టుకున్నది అచ్చంగా చంద్రబాబే అని ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు. ఈ రోజు టీడీపీ పరిస్థితి చూస్తూంటే జూనియర్ లేని లోటు కనిపిస్తోందని అన్నారు. సినీ రంగంలో ఈక్వేల్ స్టార్ డమ్ ఉన్న జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్ లలో పవన్ని చేరదీసి జూనియర్ ని పక్కన పెట్టిన ఫలితం ఇపుడు స్పష్టం గా కనిపిస్తోందని అన్నారు. టీడీపీ రాజకీయాల మీద తమ్మారెడ్డి ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.

2009 ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసి పెట్టి తన ప్రాణం మీదకు కూడా తెచ్చుకున్నారు జూనియర్ అని గుర్తు చేశారు. ఆయన చావు బతుకుల మధ్యన పోరాడి చివరికి బతికారు అని ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పారు. అంతలా టీడీపీ కోసం ప్రాణం పెట్టిన జూనియర్ ని 2014 ఎన్నికల్లో చంద్రబాబు పట్టించుకోలేదని, పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఇంటికి ఆఫీసుకు వెళ్ళి మరీ పొత్తు పెట్టుకున్నారని అన్నారు.

దాని ఫలితం ఇపుడు చూస్తే ఏమైందని ఆయన అంటూ చంద్రబాబు జైలులో ఉన్న వేళ టీడీపీ ఏమీ కాకుండా తయారైంది అన్నారు. పక్క పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ టీడీపీని నిలబెట్టాల్సి వస్తోంది అన్నారు. ఎంత చేసినా పవన్ పొరుగు పార్టీ ప్రెసిడెంట్ అవుతారు తప్ప టీడీపీ మనిషి కాలేరు కదా అని భరద్వాజ అన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయం తీసుకున్నా ఆయన పార్టీ జనసేన ఓట్లు టీడీపీకి కన్వర్ట్ కావడం మీద కూడా చూడాల్సి ఉంది అన్నారు. పవన్ కళ్యాణ్ తన పార్టీకి ఓటేయమని అడిగితేనే అభిమానులు 2019లో ఓటేయలేదని గుర్తు చేశారు. మరి జనసేన ఓట్లు టీడీపీకి టర్న్ అవుతాయని ఆశిస్తున్నారని, మంచిదే ఇపుడు జనాలు మారి పవన్ చెప్పినట్లుగా టోటల్ గా టీడీపీకి ఓటు వేయవచ్చేమో అన్నారు.

నాడు సీనియర్ ఎన్టీయార్ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన జనాలు ఇపుడు పవన్ కి కూడా స్పందిస్తారేమో అన్నారు. అయితే ఈ రోజు టీడీపీ ఇలా దీనంగా ఉండడానికి కారణం చంద్రబాబు వైఖరి అన్నట్లుగానే తమ్మారెడ్డి మాట్లాడారు. ఎప్పటికైనా టీడీపీ ఇంటి మనిషి జూనియర్ అవుతారని అది గమనంలోకి తీసుకోకుండా చంద్రబాబు రాజకీయ ఎత్తులతో పొత్తులతో వెళ్ళిన తీరు వల్లనే ఈ రోజు టీడీపీ ఇలా ఉందని విశ్లేషించారు.

ఈ రోజుకు అయితే జూనియర్ ఎన్టీయార్ పార్టీ కోసం ముందుకు రాకపోయినా ఏదో రోజున వచ్చే అవకాశాలు ఉండొచ్చేమో అని కూడా ఆయన అన్నారు. అది ఈ ఎన్నికలలో జరగవచ్చు లేదా మరో అయిదేళ్ల తరువాత అయినా జరగవచ్చు అని కూడా అంటున్నారు. ఇక సీనియర్ ఎన్టీయార్ తన చివరి రోజులలో ధర్మపీఠం ప్రోగ్రాం లో నా వారసుడు ఎప్పటికైనా టీడీపీకి వస్తారు అని చెప్పినట్లుగా జరగవచ్చేమో అని అన్నారు.

లేటెస్ట్ గా వచ్చిన టైమ్స్ నౌ సర్వేలో వైసీపీ స్వీప్ చేస్తుంది అన్న దాని మీద ఆయన మాట్లాడుతూ వైసీపీ ధీమా ఆ వైపు సర్వేలు అలా ఉంటే టీడీపీ సర్వేలు కూడా ఆ పార్టీ 130 కి తక్కువ కాకుండా గెలుస్తుంది అని వస్తున్నాయని అన్నారు. ఏది ఏమైనా అంతిమ నిర్ణేతలు ప్రజలు అని అన్నారు. మొత్తానికి చూసుకుంటే టీడీపీలో జూనియర్ ఎన్టీయార్ ఎందుకు ఇపుడు రారు అన్న దాని మీద తమ్మారెడ్డి గట్టిగానే చెప్పుకొచ్చారు. ఆయనని దూరం పెట్టారని టీడీపీ నాయకత్వానిదే ఆ తప్పు అన్నట్లుగా ఆయన మాట్లాడారు.

Tags:    

Similar News