తమ్మినేనికి వేరే ఆప్షన్ లేదా ?
ఆయన వైసీపీని వీడుతారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగినా కూడా ఆయన నుంచి స్పందన అయితే లేదు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీలోనే కొనసాగుతాను అంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. తమ్మినేని సీతారాం గత కొంతకాలంగా ఫ్యాన్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన వైసీపీని వీడుతారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగినా కూడా ఆయన నుంచి స్పందన అయితే లేదు.
కానీ అనూహ్యంగా ఆయన ఇపుడు వైసీపీలోనే ఉంటాను అని చెప్పేశారు. అయితే ఆయన వైసీపీలో ఇష్టపూర్వకంగా కొనసాగుతున్నారా లేక వేరే ఆప్షన్ లేకనా అన్న చర్చకు తెర లేస్తోంది. ఇక తమ్మినేని టీడీపీ ప్రజారాజ్యం, మళ్లీ టీడీపీ ఆ తరువాత వైసీపీ ఇలా తన మొత్తం రాజకీయ జీవితంలో నాలుగు సార్లు పార్టీలను మారారని అంటారు.
ఇపుడు కూడా ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నం చేసారు అని అంటున్నారు. ఆయన జనసేనలో చేరాలని అనుకున్నారని అంటున్నారు. అయితే అక్కడ నుంచి తగినంత సానుకూల స్పందన రాలేదని అంటున్నారు. దాంతోనే తమ్మినేని మళ్లీ ఫ్యాన్ నీడలోనే ఉండాలని చూస్తున్నారు అని అంటున్నారు.
దీని మీద కూడా అంతా చర్చిస్తున్నది ఏమిటి అంటే తమ్మినేనికి టీడీపీ రాజకీయ బిక్ష పెట్టిందని ఆయన ఆ పార్టీ ద్వారా మొత్తం నాలుగు సార్లు గెలిచారని మంత్రిగా కూడా పనిచేశారని, అయినా కూడా ఆ పార్టీని రెండు సార్లు వీడి వెళ్లారని గుర్తు చేస్తున్నారు. తాను టీడీపీని వీడను అని తాను చనిపోతే టీడీపీ జెండానే తన శరీరం మీద కప్పాలని భారీ ప్రకటనలు ఇచ్చిన తమ్మినేని ఆ తరువాత కాలంలో పార్టీలు మారిన సంగతినీ గుర్తు చేస్తున్నారు.
అందువల్ల ఆయన వైసీపీలో కొనసాగుతాను అని చెప్పిన మాటలను కూడా ఎవరూ అంత సీరియస్ గా తీసుకుంటారా అని కూడా అంటున్నారు. అయితే ఆముదాలవలస ఇంచార్జిగా తన కుమారుడిని నియమించాలని ఆయన కోరుతున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం అక్కడ కొత్త వారికే చాన్స్ ఇచ్చింది. తమ్మినేనిని పార్టీ పెద్దాయనగా గౌరవిస్తామని చెబుతోంది.
దాంతో కుమారుడి ఫ్యూచర్ ని గురించి ఆలోచన చేస్తున్న తమ్మినేని ఇప్పటికైతే వైసీపీలోనే ఉంటారని అంటున్నారు. కానీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఎవరికీ తెలియదు అని అంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతల కోసం వైసీపీ అన్వేషణ సాగుతోంది అని అంటున్నారు సీనియర్ల వల్ల పెద్దగా లాభం లేదని అంచనాకు వచ్చిన అధినాయకత్వం కొత్త వారిని దించాలని చూస్తోంది. బహుశా ఈ పరిణామాలు తమ్మినేని లాంటి సీనియర్లకు అంతగా రుచించక పోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.