మామ మూడోసారి.. అల్లుడు నాలుగోసారి.. గెలుపెవరిదో ఈసారి?

పైగా ఇక్కడ పోరు మేనమామ, మేనల్లుడి మధ్య కావడంతో ఫలితంపై తీవ్ర ఆసక్తి నెలకొందని అంటున్నారు.

Update: 2024-05-31 23:30 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలవ్వడంతో ఆసక్తికర చర్చలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా వార్ వన్ సైడ్ అనే నియోజకవర్గాల విషయాలపై పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ.. టఫ్ ఫైట్ అంటూ సర్వేల ఫలితాలు, పోలింగ్ సరళి ద్వారా తెలుస్తున్న నియోజకవర్గాలపై మాత్రం ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.

అలాంటి నియోజకవర్గాల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస ఒకటి. పైగా ఇక్కడ పోరు మేనమామ, మేనల్లుడి మధ్య కావడంతో ఫలితంపై తీవ్ర ఆసక్తి నెలకొందని అంటున్నారు. ఈసారి గెలుపు అనేది వారసత్వానికి పునాది అనే కామెంట్లూ వినిపిస్తున్న పరిస్థితుల్లో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయంపై "టఫ్ ఫైట్" అని అంటున్నారు పరిశీలకులు.

అవును... ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా పోటీతో కలిపి వైసీపీ నుంచి మూడోసారి బరిలోకి దిగారు ఆ పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆయన 2014లో సమీప టీడీపీ అభ్యర్థి, తన మేనల్లుడు కూన రవికుమార్ పై 5,449 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో... స్థానికంగా కూన బలపడుతూ వచ్చారు.

ఇదే క్రమంలో 2019లో మరోసారి మేనమామ - మేనల్లుడు తలపడ్డారు. ఈ సమయంలో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసిన సీతారాం... ఈసారి సత్తా చాటారు. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ పై 13,911 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్నారని అంటున్నారు.

ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లోనూ మరోసారి ఇద్దరూ తలపడ్డారు. ఈ సమయంలో మరోసారి గెలిచి, మంత్రి అయ్యి, రాజకీయాలనుంచి రిటైర్మెంట్ తీసుకుని, తన వారసుడిగా కుమారుడిని బరిలోకి దించి రెస్ట్ తీసుకోవాలని సీతారాం భావిస్తున్నారని అంటున్నారు. దీంతో... ఈ గెలుపు ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయిన పరిస్థితి. ఈ ఎన్నిక తమ్మినేని హవాని ఆముదాలవలసలో కంటిన్యూ చేస్తుందా లేదా తేల్చేస్తుందని అంటున్నారు.

మరోపక్క మామకు తగిన వారసుడు మేనల్లుడే అని ఆముదాలవలస ప్రజానికం నమ్మితే మాత్రం గెలుపు కూనవైపే అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... 2014లో ఓడిపోయిన ఓట్లకు డబుల్ మెజారిటీతో 2019లో గెలిచిన సీతారాం... ఈసారి ఎన్నికల్లో గెలిచి సక్సెస్ ఫుల్ గా రిటైర్ అవుతారా.. లేదా.. అనే చర్చ స్థానికంగా బలంగా వినిపిస్తుంది. అతికొద్ది రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రాబోతుందనేది తెలిసిన విషయమే!

Tags:    

Similar News