ఇంట్రస్టింగ్... మనవడుని ఖుషీ చేసిన తాత గారి 30 ఏళ్ల క్రితం షేర్లు!
అయితే వాటికి సంబంధించిన పేపర్స్ ఇప్పుడు దొరకడంతో.. పెరిగిన ఆ వాటాల విలువ ఇప్పుడు మనవడిని షాక్ కి గురిచేసిందంట
ప్రతీ మనిషీ నెల నెలా ఎంత సంపాదిస్తున్నాడు అనేది వారి వారి వ్యక్తిగత విషయం అనే సంగతి అటుంచితే... నెలకు 10వేలు సంపాదించినా, రెండు లక్షలు సంపాదించినా.. అందులో కొంత శాతం సొమ్మును పొదుపు చేయడం చాలా మంచి అలవాటని.. ఎంత చెట్టుకి అంత గాలి అనే విషయం దృష్టిలో పెట్టుకుని ఎంత చిన్నమొత్తమైనా పర్లేదు.. క్రమం తప్పకుండా పొదుపుచేయడం మాత్రమే ముఖ్యమని చెబుతుంటారు. ఈ విషయంలో మనకంటే మన పూర్వీకులే చాలా ముందుంటారని అంటుంటారు.
ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చే సంఘటన ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పుడున్నన్ని పెట్టుబడి సాధనాలు అందుబాటులో లేని రోజుల్లో కూడా భావితరాల కోసం ఆస్తులు కూడబెట్టేవారని.. పావలా పావలా ఒడిసిపట్టినట్లుగా పొదుపు చేసేవారని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో... స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని 30 ఏళ్ల క్రితంమే ఒక వ్యక్తి ఎంతో ముందుచూపుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ కొని వాటిని అలానే వదిలేశారు. అయితే వాటికి సంబంధించిన పేపర్స్ ఇప్పుడు దొరకడంతో.. పెరిగిన ఆ వాటాల విలువ ఇప్పుడు మనవడిని షాక్ కి గురిచేసిందంట.
వివరాళ్లోకి వెళ్తే... చండీగఢ్ కు చెందిన డా. తన్మయ్ మోతీవాలా తాత 1994లోనే రూ. 500 విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేశారంట. ఈ సమయంలో... ఇటీవల కుటుంబ ఆస్తులను ఒక చోట చేర్చినప్పుడు దీనికి సంబందించిన సర్టిఫికెట్ ను కనుగొన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ షేర్లను విక్రయించకుండా తన తాత అలానే వదిలేశారని.. ఆ వాటాల విలువ ఇప్పుడు డివిడెండ్లు ఏవీ కలపకుండానే రూ.3.75 లక్షలు అయ్యిందని తెలిపారు.
అయితే... ఇప్పుడు ఈ మొత్తం ఎక్కువ కానట్లు అనిపిస్తున్నప్పటికీ... 30 ఏళ్లలో సుమారు 750 రెట్లు రిటర్నులు ఇవ్వడమంటే సాధారణ విషయం కాదని తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కింద ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... "ఈ తరం యువత పెద్దవారిని చూసి ఎంతో నేర్చుకోవాలి" అని ఒకరు కామెంట్ చేయగా... "మన పూర్వికులకు అన్ని విషయల్లోనూ ఉన్న ముందు చూపుకు జోహార్" అని ఇంకొకరు కామెంట్ చేశారు!