విషయం చిన్నదే.. కంటెంట్ కొడాలిది అందుకే వైరల్
ఇందులో విషయం పెద్దగా లేకపోయినా తమదైన మసాలా జోడించడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.
టీడీపీ సోషల్ మీడియా రెండు రోజులుగా ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తోంది. తమకు ఎంతో ఇష్టమైన కంటెంట్ లభిస్తుండటంతో ట్రోలింగులను దంచికొడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో క్రేజ్ ఉండే వల్లభనేని వంశీ, కొడాలి వంటి వారు బయటకు వస్తే టీడీపీ సోషల్ మీడియా వెయ్యి కళ్లతో నిఘా వేస్తుంది. ప్రస్తుతం వంశీ జైలులో ఉండటంతో మాజీ మంత్రి కొడాలిపైనే ఫుల్ ఫోకస్ చేస్తోంది. ఆయన ఏం మాట్లాడినా, ఎక్కడ కనిపించినా అందులో వైరల్ అయ్యే కంటెంట్ కోసం తెగ సెర్చ్ చేస్తోంది. తాము అనుకున్న విధంగా కొడాలిని వైరల్ చేస్తూ ట్రెండింగులోకి తెస్తోంది. నిన్న విజయవాడలో ఓ మీడియా చానల్ రిపోర్టరుతో మాట్లాడిన మాటలను వైరల్ చేసిన టీడీపీ సోషల్ మీడియా.. ఈ రోజు జగన్ ఇంటి ముందు కొడాలి పడిగాపులు అంటూ మరో వీడియోను వైరల్ చేస్తోంది. ఇందులో విషయం పెద్దగా లేకపోయినా తమదైన మసాలా జోడించడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.
నందిని పంది చేయడం, పందిని నంది చేయడం ఒక్క సోషల్ మీడియాకే చెల్లుతుంది. డిజిటల్ క్రియేటర్ల రూపంలో మాయల మరాఠీలు ఏ చిన్న అంశానాన్ని అయినా తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియాల్లో అయితే వైరల్ కంటెంట్ ఎప్పుడు లభిస్తుందా? అంటూ ఎదురు చూస్తుంటారు. నిజంతో పని లేకుండా కంటెంట్ కనిపిస్తే చాలు మసాల జోడించి వైరల్ చేయడానికి ప్రాధాన్యమిస్తుంటారు. ప్రతి పార్టీకి ఈ సోషల్ మీడియా వింగ్ ఉన్నా, ఈ మధ్య అరెస్టులతో ప్రతిపక్షం వైసీపీ కాస్త డల్ అయిందనే ప్రచారం ఉంది. కానీ, అధికార బలంతో టీడీపీ సోషల్ మీడియా పుల్ యాక్టివ్ గా పనిచేస్తోంది. ప్రతిపక్ష నేతలు బయటకు రాగానే వైరల్ కంటెంట్ కోసం జల్లెడ పడుతూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది.
ప్రధానంగా టీడీపీకి టార్గెట్ గా చెప్పుకునే కొందరు నేతలు ఎప్పుడు బయటకు వచ్చినా డేగ కళ్లతో నిఘా వేసే టీడీపీ సోషల్ మీడియా.. మాజీ మంత్రి కొడాలి విషయంలో మరింత చురుకుగా పనిచేస్తోంది. అధికారంలో ఉండగా, మాటలతో విరుచుకుపడి నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన కొడాలి.. అధికారం కోల్పోయిన తర్వాత 9 నెలలుగా అండర్ గ్రౌండ్ లోనే ఉంటున్నారు. ఇదే విషయమై నిన్న విజయవాడలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చి వైరల్ అయ్యారు కొడాలి. ఇక ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు తాడేపల్లి వచ్చిన కొడాలిపై టీడీపీ ఓ వీడియో చేసి వైరల్ చేస్తోంది. ఏదో ఫోన్ రావడంతో జగన్ ఇంటి ముందు ఉన్న ఫుట్ పాత్ పై ఒంటరిగా కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న కొడాలిని వీడియో తీసి.. పాపం కొడాలి రెండు గంటల పాటు పడిగాపులు అంటూ సోషల్ మీడియాలో వదిలింది.
ఇందులో విషయం పెద్దగా లేకపోయినా.. కంటెంట్ కొడాలిది కావడంతో క్షణాల్లోనే బాగా వైరల్ అయింది. తన స్నేహితుడు వంశీ అరెస్టుతో అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన కొడాలి రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఆయన వీడియోలు, బైట్ల కోసం ఆ పార్టీ సోషల్ సైనికులు వేయికళ్లతో ఎదురుచూడటం కనిపిస్తోంది. దీంతో ప్రత్యర్థుల సోషల్ మీడియాకు చిక్కకుండా మెసలడమే ఇప్పుడు నేతలకు బిగ్ టాస్క్ గా మారుతోందని అంటున్నారు.