వచ్చేయ్ ఆ మాటలు మేం పట్టించుకోం!
ఇలా పరస్పరం తిట్టుకున్న వారే ఇప్పుడు ఒకటిగా మారిపోయారు.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అప్పుడే తిట్టుకున్న వారు మరుసటి రోజే మిత్రులుగా మారొచ్చు. బద్ధ శత్రువులు కూడా భుజాలు కలుపుకుని తిరగొచ్చు. ఇప్పుడు వరంగల్ రాజకీయం పలు మలుపులు తిరుగుతోంది. ఇక్కడ నుంచి మొదట బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను తమ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తుండటంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కడియం కావ్య హ్యాండ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతల్లో బెంగ పట్టుకుంది.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ విషయంలో గొడవ జరిగినప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం కడియం శ్రీహరికే మొగ్గు చూపింది. ఆయనకే టికెట్ కేటాయించింది. దీంతో రాజయ్య కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తనకు అన్యాయం చేశారని అక్కసు వెళ్లగక్కారు. అప్పుడే రాజయ్య కాంగ్రెస్ లో చేరాలని భావించినా రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన చేరిక ఆలస్యం అయింది.
ఇప్పుడు వరంగల్ లోక్ సభ స్థానం బరిలో కడియం కావ్యను రంగంలోకి దింపినా గెలిచే సత్తా లేదని తెలుసుకుని కావ్య మనసు మార్చుకుని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. దీంతో బీఆర్ఎస్ నేతలు కడియంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇక తాటికొండ రాజయ్యను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించింది. వరంగల్ లోక్ సభ టికెట్ ఇస్తామని చెప్పడంతో రాజయ్య చేరిక ఖాయమైంది.
ఇలా పరస్పరం తిట్టుకున్న వారే ఇప్పుడు ఒకటిగా మారిపోయారు. మా ఆప్తుడు అనుకున్న కడియం శ్రీహరి పార్టీకి శఠగోపం పెట్టడంతో బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైంది. ఇలా పార్టీకి పంగనామాలు పెట్టిన శ్రీహరిని అదను చూసి దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇచ్చి కడియం దూకుడుకు పగ్గాలు వేయాలని భావిస్తోంది.
తాటికొండ రాజయ్య చేరికను వ్యతిరేకించే వారు లేరు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరు పార్టీని వీడి వెళ్లిపోతున్న తరుణంలో రాజయ్య పార్టీకోసం పని చేసేందుకు రావడమే వారికి ప్రధాన బలంగా చెప్పుకుంటున్నారు. అసలే పార్టీ కాస్త ఖాళీ అయిపోతోంది. ఈ నేపథ్యంలో రాజయ్య రాక బలంగానే చెబుతున్నారు. అందరు వెళ్లిపోతున్న తరుణంలో ఆయన తిరిగి రావడం వారికి సంతోషం కలిగిస్తోంది.