కండువాల భయం...జగన్ వైఖరి మారాలా ?
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి కండువాల భయం పట్టుకుందా అన్న చర్చ వస్తోంది. తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా జారుకుంటారు అని ఆయన అనుమానిస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి కండువాల భయం పట్టుకుందా అన్న చర్చ వస్తోంది. తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా జారుకుంటారు అని ఆయన అనుమానిస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. వైసీపీ గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన తరువాత తన పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించిన సమావేశంలో ఏకంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ని ఇదే విషయం మీద నేరుగానే ప్రశ్నించారు.
పార్టీ కండువా ఎందుకు వేసుకోలేదని ఆయన పార్టీ మీటింగులో అడగడమే కాదు ఏకంగా ఆయన విధేయతనే అనుమానించారు అని ప్రచారం సాగుతోంది. దాంతో చంద్రశేఖర్ మౌనంగా ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మీడియా ముందుకు తరచూ వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది తాటిపర్తి చంద్రశేఖర్ కావడం విశేషం. ఆయన చాలా అంశాల మీద గడచిన తొమ్మిది నెలల కాలంలో అధికార పార్టీని నిలదీశారు.
చిత్రమేంటి అంటే ఆయన పార్టీకి విధేయుడిగానే ఉన్నారు. మీడియా కూడా ఆయనను అలాగే చూస్తోంది. ఎవరూ అనుకోనిది ఆయన విషయంలో జగన్ అనుమానించడం మాత్రం ఒకింత ఆశ్చర్యమే అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే వైసీపీ అధినాయకత్వానికి తన సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద ఏమైనా డౌట్లు ఉన్నాయా అన్నది కూడా చర్చకు వస్తోంది.
ఆ మాటకు వస్తే జగన్ అసెంబ్లీకి వచ్చింది అటెండెన్స్ వేయించుకోవడానికి అని కూటమి పార్టీలు విమర్శించాయి. అదే నిజమనేలా వైసీపీ వైఖరి ఉంది. మరి ఎందుకు ఇలా చేశారూ అంటే వైసీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుందన్న కూటమి మైండ్ గేం తో వారు ఎక్కడ అటు వైపుగా జారిపోతారేమో అని వైసీపీ అధినాయకత్వం అనుమానించి సభకు అటెండ్ అయింది అని అంటున్నారు.
అందుకే కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉంటూ ఆ మీదట బయటకు వచ్చేశారు అని అంటున్నారు. అయితే ఈ ఒక్కటీ చాలదని పార్టీ హై కమాండ్ ఊహించినట్లుగానే కొందరు ఎమ్మెల్యేలలో చాలా అసంతృప్తి ఉందని అంటున్నారు. ఆ అసంతృప్తి పార్టీ పెద్దల పోకడల మీదనే అని అంటున్నారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులూ అటెండ్ కావాలని మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇందులో కొత్తవారు అయితే బలంగా అదే కోరుకుంటున్నారు.
అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యే గెలిచి వెళ్ళడమే అసలైన హోదా అన్నది ఇక్కడ కీలక పాయింట్. వైసీపీ హైకమాండ్ కోరుతున్న విపక్ష హోదాతో తమ ఎమ్మెల్యే హోదాను పట్టించుకోవడం లేదని చాలా మంది ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారు.
సభకు హాజరైతే సభ్యులుగా ప్రశ్నలు వేయవచ్చు. అధికార పక్షం సహకరించకపోయినా జనం దృష్టిలో ప్రత్యేకించి తమను గెలిపించిన నియోజకవర్గం వారి దృష్టిలో తాము అలా ఫోకస్ కావచ్చు అన్నది ఎమ్మెల్యేల ఆలోచన. వైసీపీ హైకమాండ్ మాత్రం సభకే వద్దు అన్నదే వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది అని అంటున్నారు.
అయితే ఈ విషయాలు అధినాయకత్వానికి ఎంత వరకూ తెలుసో ఏమో కానీ తమ ఎమ్మెల్యేలు జారిపోతారన్న అనుమానాలు ఉన్నాయని మాత్రం చంద్రశేఖర్ ఉదంతంలో తెలుస్తోందని అంటున్నారు. మొత్తం మీద కండువాల భయం అయితే వైసీపీ పెద్దలకు పట్టుకుంది అని అంటున్నారు. కానీ ఇదే తీరులో సభకు నమస్కారాలు పెడితే ఈ అనుమానాలే నిజం కావచ్చు. అపుడు ఎంత చేసినా ఏమి చేసినా ఇబ్బందులు కాక తప్పదని అంటున్న వారూ లేకపోలేదు.