ఐదే ఐదు నిమిషాల్లో.. రూ.22,450 కోట్ల సంపాదన!
టాటాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1900వ దశకంలో జేఆర్‌డీ టాటాతో మొదలుపెట్టి ప్రస్తుతం రతన్ టాటా వరకు దేశ పారిశ్రామికాభివృద్ధికి విశేష కృషి చేశారు.
టాటాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1900వ దశకంలో జేఆర్‌డీ టాటాతో మొదలుపెట్టి ప్రస్తుతం రతన్ టాటా వరకు దేశ పారిశ్రామికాభివృద్ధికి విశేష కృషి చేశారు. టాటా అంటేనే ఒక పేరు మోసిన బ్రాండ్. అంబానీ, ఆదానీలు ఈ మధ్య కాలంలో పాపులర్ అయ్యారేమోగానీ బ్రిటిషర్ల కాలం నుంచే టాటాలు వెలుగొందుతూ వస్తున్నారు.
టాటా గ్రూపులు వివిధ రంగాల్లో విస్తరించిన సంగతి తెలిసిందే. ఇందులో అతిపెద్ద కంపెనీ.. టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్). మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉద్యోగులు టీసీఎస్ లో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల కంపెనీలకు, సంస్థలకు సాఫ్టువేర్ సర్వీసులను టీసీఎస్ అందిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా టీసీఎస్ షేర్లు స్టాక్ మార్కెట్ లో దూసుకుపోయాయి. వారంలో చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం (జూలై 26) టీసీఎస్ ఏకంగా రూ.22,450 కోట్లను ఆర్జించింది. అది కూడా ఐదంటే ఐదే నిమిషాల్లో. టీసీఎస్ షేర్లు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో తారాజువ్వల్లా దూసుకుపోవడంతో భారీగా ఆ సంస్థ లాభపడింది.
కంపెనీ మార్కెట్ క్యాప్ జూలై 25న గురువారం రూ. 15,64,063.05 కోట్లుగా ఉంది. ఈ మొత్తం జూలై 26న శుక్రవారం.. ట్రేడింగ్ ప్రారంభమైన ఐదు నిమిషాలకే 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. తద్వారా రూ.15,86,513.28 కోట్లకు పెరిగింది. దీంతో ఐదు నిమిషాల్లోనే టీసీఎస్ రూ.22,450.23 కోట్ల లాభాన్ని మూటగట్టుకుంది.
టీసీఎస్ షేర్లు గురువారం (జూలై 25న) స్టాక్ మార్కెట్ లో రూ.4,322.90 వద్ద ముగిశాయి. ఇక శుక్రవారం (జూలై 26) స్వల్ప పెరుగుదలతో రూ.4,331.05 వద్ద మొదలైంది. గతేడాది నవంబర్ 1న కంపెనీ షేరు రూ.3,313గా ఉంది. అప్పటి నుంచి 9 నెలల్లో కంపెనీ షేరు రూ. 1,071.95 (32.35) శాతం పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం.. త్వరలోనే రూ.4,500 స్థాయికి ఒక్కో టీసీఎస్ షేర్ చేరుతుంది.
కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా కంపెనీ షేర్లు భారీ ఎత్తున లాభపడ్డాయి. బడ్జెట్ నాడు టాటా షేర్లు 2 శాతం పెరగడంతో టీసీఎస్ రూ.34,500 కోట్లు లాభపడింది.
బాంబే స్టాక్ ఎక్సే ్చంజ్ (బీఎస్‌ఈ) డేటా ప్రకారం.. దేశంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థగా టీసీఎస్ నిలుస్తోంది. ఈ వారంలో ట్రేడింగ్ చివరి రోజు ఐదు నిమిషాల్లోనే టీసీఎస్ షేర్లు భారీగా లాభపడ్డాయి. దీంతో రికార్డు స్థాయిలో 52 వారాల గరిష్ట స్థాయిని అందుకున్నాయి.
ఈ వారంలో ట్రేడింగ్ చివరి రోజు.. శుక్రవారం ఉదయం 9.20 గంటలకు ఒక్కో షేరు రూ.4,384.95 చేరింది. గురువారంతో పోలిస్తే 1.44 శాతం మేర పెరిగాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు అంటే.. జూలై 22న కంపెనీ షేర్లు రూ.4,289.61 వద్ద ఉన్నాయి. ఆ తర్వాత కంపెనీ షేర్లు రూ.95.34 పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయికి పరుగుతీశాయి.