జగన్ సొంత ఇలాకాలో కూటమి భారీ షాక్ ఇస్తుందా ?

పైగా ఆయన ఒంటిమెట్ట జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. దానితో పాటు పులివెందుల జెడ్పీటీసీ చనిపోవడంతో అక్కడ సీటు ఖాళీ అయింది.

Update: 2024-09-06 04:03 GMT

జగన్ సొంత జిల్లా కడపలో ఆయన రాజకీయ బలాన్ని దెబ్బ తీయడం ద్వారా నైతికంగా రాజకీయంగా పూర్తిగా చతికిలపడేలా చేయాలని టీడీపీ కూటమి భారీ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా ప్రచారం సాగుతోంది. కడప జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నికను దీని కోసం సరైన వేదికగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కడప జెడ్పీ చైర్మన్ పీఠం మీద ఎలాగైనా కూటమి అభ్యర్ధిని కూర్చోబెట్టాలన్నది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పెద్దల ఆలోచన. కడప జెడ్పీ చైర్మన్ కి ఎన్నికలు వచ్చిపడ్డాయి. కడప జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమరనాధరెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

పైగా ఆయన ఒంటిమెట్ట జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. దానితో పాటు పులివెందుల జెడ్పీటీసీ చనిపోవడంతో అక్కడ సీటు ఖాళీ అయింది. ఇలా మొత్తం కడప జెడ్పీలో యాభై మంది సభ్యులు ఉంటే రెండు ఖాళీలు ఉన్నాయి. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కడపలో మొత్తం జెడ్పీటీసీలను వైసీపీ గెలుచుకుంది. ఒక్కటి మాత్రమే టీడీపీ పరం అయింది.

అయితే ఎన్నికల ముందు తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మరో అయిదురుగు వైసీపీ జెడ్పీటీసీలు కూటమి వైపు మళ్లారు. దాంతో కూటమి బలం ఆరుకు పెరిగింది. అదే సమయంలో వైసీపీ బలం 42 దగ్గర ఉంది. కడప జెడ్పీ పీఠం గెలుచుకోవాలీ అంటే 26 మంది మద్దతు కావాలి. అయితే రెండు సీట్లు ఖాళీ కాబట్టి 25 మంది ఉన్నా సరిపోతుంది.

మరి పంతొమ్మిది మంది జెడ్పీటీసీల మద్దతు ఎలా దక్కుతుంది. అంటే వైసీపీలోని వారికి కూటమి పెద్దలు ఎర వేస్తున్నారు. ఏకంగా ఒక్కో జెడ్పీటీసీకి పాతిక లక్షల దాకా ముట్టచెబుతామని బేరాలు సాగిస్తున్నారని అంటున్నారు. వైసీపీలో జెడ్పీటీసీలుగా నెగ్గి మూడున్నరేళ్ళు అయినా ఎలాంటి గుర్తింపునకూ నోచుకోని వారు అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు.

అలాంటి వారిని చూసి మరీ తమ వైపు తిప్పుకునేందుకు కూటమి ఎత్తుగడలు వేస్తోంది. అలాగే కడప పరిధిలోని నియోజకవర్గ స్థాయి వైసీపీ నేతలను ముందుగా చేర్చుకుని వారి ద్వారా స్థానిక జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది.

దాంతో వైసీపీ కూడా అలెర్ట్ అయింది. జగన్ అయితే కడప జెడ్పీ సీటు ప్రతిష్టాత్మకం కాబట్టి తాడేపల్లిలో ఒక సమావేశం నిర్వహించి మరీ వారికి దిశానిర్దేశం చేశారు. అంతే కాదు గత్యంతరం లేని పరిస్థితుల్లో వైసీపీ కూడా తమ సొంత పార్టీ జెడ్పీటీసీలకు అడ్వాన్స్ గా అయిదు లక్షల దాకా సొమ్ములు ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

కూటమి ఎంత మొత్తం ఇస్తే అంతకు రెట్టింపు ఇస్తామని కూడా వైసీపీ నేతలు జెడ్పీటీసీలకు చెబుతున్నారని ప్రచారం సాగుతోంది. ఆ విధంగా చేస్తే తమ వైపు ఉంటారని జెడ్పీ పీఠం చేజారకుండా చూసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారుట.

అయితే అధికారం చేతిలో ఉండడంతో పాటు వైసీపీలో పేరుకుపోయిన అసంతృప్తి, పైగా ఆర్ధికంగా ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా ఫ్యాన్ పార్టీలో జెడ్పీటీసీలను కూటమి వైపు నడిపిస్తాయా అన్న చర్చ అయితే ఉంది. అదే జరిగితే మాత్రం జగన్ సొంత ఇలాకాలో భారీ దెబ్బ పడినట్లే అని అంటున్నారు.

జగన్ కి వైసీపీకి గుండెకాయ కంచుకోట లాంటి కడప సీటుని కొడితేనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లుగా ఉంటుంది అని కూటమి భావిస్తోందిట. తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న కడప జెడ్పీటీసీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గానూ ఏడింటిని కోల్పోయిన వైసీపీకి కడప జెడ్పీ పీఠం ప్రాణప్రదంగా ఉంది. దంతో ఆరు నూరు అయినా గెలిచి తీరుతామని వైసీపీ చెబుతోంది

Tags:    

Similar News