రెండు బాంబులు.. ఒకటి తుస్సు.. మరొకటి బ్లాస్ట్!

బాంబులు ఎన్నో రకాలు.. అయితే పొలిటికల్ బాంబులు కోసం ఎవరూ విని ఉండరు. ఏపీలో మాత్రం ట్రూత్ బాంబులు, పొలిటికల్ బాంబులు ఈ మధ్య పేల్చుతున్నారు.

Update: 2025-02-19 09:00 GMT

బాంబులు ఎన్నో రకాలు.. అయితే పొలిటికల్ బాంబులు కోసం ఎవరూ విని ఉండరు. ఏపీలో మాత్రం ట్రూత్ బాంబులు, పొలిటికల్ బాంబులు ఈ మధ్య పేల్చుతున్నారు. కొన్ని భారీ సౌండ్ చేస్తుంటే.. మరికొన్ని తుస్సుమంటున్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ట్రూత్ బాంబ్ పేల్చుతామని నిన్న వైసీపీ టైమ్ చెప్పింది. రాత్రి 7 గంటలకు టైమ్ బాంబులా ట్రూత్ బాంబు పేల్చి రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తామని ప్రకటించింది. అయితే అదే టైమ్ కు టీడీపీ ఆటం బాంబు పేల్చింది. దీంతో రెండు పార్టీల పేల్చిన పొలిటికల్ బాంబులు ఏపీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సోషల్ మీడియా ముందుగా ఈ ట్రూత్ బాంబులు, టైమ్ బాంబుల కల్చర్ తీసుకువచ్చింది. గత ఏడాది అక్టోబరు 23న టీడీపీ తన సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసింది. ‘‘రేపు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్ పోజ్ కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 పీఎం’’ అప్పట్లో టీడీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అయింది. దీనికి పోటీగా వైసీపీ కూడా అదే సమయంలో బ్లాస్టింగ్ న్యూస్ రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇలా రెండు పార్టీలు పోటాపోటీగా చేసిన పోస్టులు అప్పట్లో వైరల్ అయ్యాయి.

అయితే అప్పట్లో రెండు పార్టీలు రివీల్ చేస్తామన్న సెన్సేషన్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. మాజీ సీఎం జగన్ వేసిన దావాపై ఆయన తల్లి విజయమ్మ రాసిన లేఖను టీడీపీ పోస్టు చేసి అదే బిగ్ ఎక్స్ పోజ్ అంటూ చెప్పుకుంది. అయితే అప్పటికే ఓ పత్రికతో పాటు వైబ్, యూట్యూబ్ చానళ్లో ఆ అంశం ప్రచారం జరగడంతో టీడీపీ చెప్పుకున్న సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయింది. అదేవిధంగా అదే సమయానికి బిగ్ బ్లాస్ట్ అన్న వైసీపీ కూడా పేర్లు లేకుండా ఓ టీడీపీ నేతకు డ్రగ్స్ లింకులు ఉన్నాయంటూ ఆధారాలు లేని పోస్టు వేసి తుస్సుమనిపించింది.

ఇక తాజాగా అదే క్రమంలో వల్లభనేని వంశీ ఎపిసోడులో ట్రూత్ బాంబు పేల్చుతామంటూ నిన్న ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న కేసులో వైసీపీ ఏం బాంబు పేల్చుతుందా? అంటూ అంతా ఎదురుచూశారు. అయితే అప్పటికే అందరికీ తెలిసిన సత్యవర్థన్ వాంగ్మూలాన్ని బయటపెట్టి అభిమానుల ఉత్కంఠను వైసీపీ నీరుగార్చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటూ సత్యవర్థన్ గతంలో మేజిస్ట్రేట్ కు వాంగ్మూలమిచ్చారు. అయితే సత్యవర్థన్ ను బెదిరించడం వల్లే ఆయన ఫిర్యాదు వాపసు తీసుకున్నాడని పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే వంశీని అరెస్టు చేశారు. ఈ ఎపిసోడ్ పై వారం రోజులుగా చర్చ జరుగుతుండగా, టూత్ బాంబు పేరిట వైసీపీ పాత విషయాన్నే చెప్పడంతో ఆ పార్టీ అభిమానులు కూడా నీరు గారిపోయారంటున్నారు.

ఇక అదే సమయానికి టీడీపీ చెప్పపెట్టకుండా పెద్ద ఆటం బాంబే పేల్చింది. వంశీ ఇంట్లో సీసీ పుటేజ్ ను బయటపెట్టింది. ఆ వీడియోలో వంశీ, సత్యవర్థన్ ఇద్దరూ ఉన్నారు. ఇప్పటివరకు సీసీ పుటేజీ ఉందని చెప్పడమే కానీ అది బయటపెట్టలేదు. అయితే వైసీపీ ట్రూత్ బాంబుకు విరుగుడుగా టీడీపీ వంశీ ఇంట్లో సీసీ పుటేజీ రిలీజ్ చేసి ఆటం బాంబు పేల్చింది. వైసీపీ ట్రూత్ బాంబు కన్నా కొద్దిగా మిన్నలా ఈ సీసీ పుటేజ్ పై ఎక్కువగా చర్చ జరిగిందని అంటున్నారు. మొత్తానికి ఏపీలో కొత్త ట్రెండ్ లా మారిన పొలిటికల్ బాంబు కల్చర్ మున్ముందు ఎలాంటి సెన్సేషన్ ఇష్యూలను బయటకు తీస్తుందో చూడాలి.

Tags:    

Similar News