ఢిల్లీలో మాజీ పోలీస్ బాస్...బాబు లెక్కలు అవేనా ?

ఈ పదవిని గతంలో చేసిన టీడీపీ మాజీ ఎంపీ సీనియర్ నేత అయిన కంభంపాటి రామ్మోహన్ కూడా ఈసారి గట్టిగానే ప్రయత్నాలు చేశారు.

Update: 2025-02-16 01:30 GMT

తెలుగుదేశం పార్టీ ఎపుడు అధికారంలోకి వచ్చినా సీనియర్ నేతలు చాలా మంది ఆశపడి మోజు పడే పదవి ఒకటి ఉంటుంది. అదే ఢిల్లీలో ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికార ప్రతినిధి పదవి. ఈ పదవిని ఎంతో మంది గతంలో చేశారు. మరెంతో మంది ఇపుడు ఆశపెట్టుకున్నారు. ఈ పదవిని గతంలో చేసిన టీడీపీ మాజీ ఎంపీ సీనియర్ నేత అయిన కంభంపాటి రామ్మోహన్ కూడా ఈసారి గట్టిగానే ప్రయత్నాలు చేశారు.

అదే విధంగా రెండు సార్లు గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పనిచేసిన గల్ల జయదేవ్ కూడా ఈ పదవి కోసం చూశారని ప్రచారం సాగింది. కానీ ఆశ్చర్యకరంగా చంద్రబాబు ఈ పదవిని మాజీ పోలీస్ బాస్ అయిన ఆర్పీ ఠాకూర్ ను ప్రత్యేక సలహాదారుగా నియమించారు ఆయన ఈ పదవిలో రెండేళ్ళ పాటు కొనసాగుతారు. ఆయనకు ఇది కేబినెట్ ర్యాంక్ పదవి.

ఇక ఆర్పీ ఠాకుర్ గురించి చెప్పాల్సి వస్తే కనుక ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీగా పనిచేశారు. ఆయన పట్ల చంద్రబాబుకు ఎంతో నమ్మకం ఉంది. అలాగే ఆయన ప్రతిభ మీద కూడా గురి ఉంది. అందుకే ఆయనకు ఏరి కోరి ఇంతటి కీలకమైన స్థానానికి ఎంపిక చేశారు అని అంటున్నారు.

పోలీస్ శాఖలో అత్యున్నత పదవులు నిర్వహించిన అనుభవం ఉన్న ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఢిల్లీలో టీడీపీ కూటమి ప్రభుత్వం తరఫున అతి ముఖ్య బాధ్యతలనే నిర్వహిస్తారు అని అంటునారు. ముఖ్యంగా ఢిల్లీలో రాజకీయ పరిణామాలను ఆయన ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడానికే అని అంటున్నారు. అదే విధంగా కేంద్రంలో కొనసాగుతున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి టీడీపీ జేడీయూ మద్దతు అత్యంత కీలకంగా ఉంది.

అయితే రాజకీయాలు ఎపుడెలా మారుతాయో ఎవరికీ తెలియదు అని అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల తరువాత బీజేపీకి కొండంత నిబ్బరం వచ్చింది అని అంటున్నారు. ఇక ఏ ఎన్నిక జరిగినా తాము నల్లేరు మీద నడకలా గెలిచి వస్తామని కమలనాధులు ధీమాగా ఉన్నారు. దాంతో పాటుగా ఎదురులేని రాజకీయ పరిస్థితులు ఇపుడు బీజేపీకి ఉన్నాయి.

బీజేపీ పెద్దలు అయితే రాజకీయాల్లో ఎందాకైనా అన్నట్లుగానే ఉంటారని చెబుతారు. ఇది రాజకీయం ఇక్కడ మిత్రులు ప్రత్యర్ధులు అని వేరుగా ఉండరు. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలను ఆకర్ష్ పధకం ద్వారా లాగేస్తున్న వైనం ఉందని ఒక వైపు ప్రచారం సాగుతోంది. ఇక లోక్ సభలో బీజేపీ అవసరాలు ఎన్నో ఉన్నాయి.

దాంతో రాజకీయ సయ్యాట కమలం వైపు నుంచి మొదలైతే అందులో ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారని గ్యారంటీ ఏమీ లేదు. మిత్రులు కూడా ఉండొచ్చు. ఏ రకమైన రాజకీయ వ్యూహాలు పన్ని అయినా బలాన్ని పెంచుకోవడమే నయా రాజనీతి అయిన వేళినా ఎంత మిత్రులు అయినా ఎంతగా కూటమి కట్టినా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

అంతే కాదు నిరంతరం నిఘా కూడా అవసరం అని అంటున్నారు. ఇక బీజేపీ ముందు ఎన్నో కీలకమైన బిల్లులు ఉన్నాయి. దాంతో బీజేపీ పెద్దల వైపు నుంచి ఏమైనా ఆకర్షణలు ఉంటే ఆ వైపునకు ఎవరూ మొగ్గు చూపకుండా ముందే అలెర్ట్ కావడం కోసమే కేబినెట్ ర్యాంక్ తో మాజీ పోలీస్ బాస్ ని ఢిల్లీలో టీడీపీ అధినాయకత్వం ఉంచింది అన్న ప్రచారం కూడా సాగుతోంది.

ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ విధంగా అప్రమత్తం కావడం మంచిదే అని అంటున్నారు. ఢిల్లీ తర్వాత మరో ఏడెనిమిది నెలలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తే కనుక ఆ తర్వాత కమలం పార్టీ రాజకీయ విశ్వరూపం చూడవచ్చు అన్న ప్రచారం అయితే ఉంది. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నపుడే దూకుడు చేయాలన్నది కూడా చాణక్య నీతి.

అందువల్ల తెలుగుదేశం చేపట్టిన ఈ నియామకం వెనక ఎన్నో వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ టీడీపీల మధ్య పొత్తులు పెడాకులు అన్నవి ఇప్పటికి అనేకసార్లు జరిగాయి. ఇపుడు కూడా రాజకీయ అవసరాలే రెండు పార్టీలను దగ్గర చేశాయి సిద్ధాంతాల పరంగా భినమైన వైఖరి రెండింటికీ ఉంది. ఉదాహరణకు వక్ఫ్ సవరణ బిల్లు విషయంలోనే బీజేపీకి టీడీపీకి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంటారు.

జమిలి ఎన్నికల విషయంలో చూసినా టీడీపీ ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తోంది అన్న మాట ఉంది. ఇంకా బీజేపీ ఆలోచనలకు టీడీపీకి మధ్య అయితే భేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ అప్రతిహత విజయాలు ఆ వైపు నుంచి దూకుడు పెంచేస్తే అంతవరకూ పరిస్థితి తెచ్చుకోకుండా టీడీపీ అప్రమత్తం అయ్యేందుకు ఈ విధంగా చేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News