ఎమ్మెల్యే రాము తీరుపై టీడీపీ కార్యకర్తల గుస్సా!

రఘురామ కేసులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు కామేపల్లి తులసిబాబు ప్రమేయం వెలుగుచూడనంత వరకు టీడీపీలో ఎమ్మెల్యే రాము ఓ హీరో.

Update: 2025-01-17 12:30 GMT

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టీడీపీలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? తన విజయం కోసం పనిచేసిన కామేపల్లి తులసిబాబు ఓ హైప్రోఫైల్ కేసులో నిందితుడిగా తేలడం, ఆయనకు ఎమ్మెల్యే రాము సపోర్ట్ చేస్తున్నారు అనే  ఆరోపణలతో ఎమ్మెల్యేపై సొంతపార్టీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

రఘురామ కేసులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు కామేపల్లి తులసిబాబు ప్రమేయం వెలుగు చూడనంత వరకు టీడీపీలో ఎమ్మెల్యే రాము ఓ హీరో. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీకి టార్గెట్ అయిన మాజీ మంత్రి కొడాలి నానిపై ఎన్నికల్లో పోరాడిన రాముకు పార్టీ క్యాడర్ అంతా ఎంతో సపోర్టు చేశారు. టీడీపీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో గుడివాడలో రాము గెలుపు అంతే ముఖ్యమన్నట్లు పోరాడారు. టీడీపీ సోషల్ మీడియాతోపాటు పార్టీ సానుభూతిపరులు, ఎన్ఆర్ఐలు ఒకరేంటి టీడీపీతో బంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా రాము గెలుపు కోసం ఆహర్నిశలు తపించారు. పార్టీ అంతా ఇంతాలా శ్రమిస్తే.. తనను తులసిబాబు ఒక్కరే గెలిపించినట్లు రాము వ్యవహరించడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడుగా తెలిసిన తర్వాత ఆయనను ఎమ్మెల్యే రాము దూరం పెట్టాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, ఎమ్మెల్యే ఇందుకు పూర్తిభిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విచారణకు తులసిబాబు వెళితే ఆయన వెంట వందల కార్లతో టీడీపీ కార్యకర్తలను పంపడం టీడీపీ కార్యకర్తలకు రుచించడం లేదు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చినా ఎమ్మెల్యే స్పందించకపోవడం కార్యకర్తలకు మరింత కోపం తెప్పిస్తోందంటున్నారు.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. రఘురామ అరెస్టు సమయంలో అధినేత చంద్రబాబు నిద్రలేకుండా గడిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. పార్టీ అంత ప్రాధాన్యమిచ్చిన వ్యవహారంలో ఎమ్మెల్యే రాము ఆచితూచి స్పందించాల్సివుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే రాము ఎలా ఆలోచించారో కానీ, పార్టీ కార్యకర్తలతో అగాధం పెంచుకునేలా నడుచుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

తులసిబాబు ఎపిసోడ్ వెలుగుచూడనంత వరకు ఎమ్మెల్యే రాముకు పార్టీలో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆయన కార్యక్రమాలకు టీడీపీ సోషల్ మీడియాలో మంచి ప్రచారం దక్కేది. గుడివాడలో గెలిచి పార్టీ ప్రతిష్టను కాపాడరని ఎమ్మెల్యే రాము ప్రశంసలు అందుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తులసిబాబు వ్యవహారంలో ఎమ్మెల్యే రాజకీయంగా ఆలోచించకపోవడం వ్యక్తిగతంగా ఆయనకు మైనస్సేనంటున్నారు. సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమారుతో ఎమ్మెల్యే రాముకు బంధుత్వం ఉందన్న కారణంగా తులసిబాబు పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడాన్ని పార్టీ కూడా తీవ్రం పరిగణిస్తోందంటున్నారు. ఏదైనాసరే పార్టీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వైఖరి చర్చకు దారితీస్తోంది. దీనిపై అధినేత నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News