లోకేష్‌తో రవీంద్రారెడ్డి భేటీ.. టీడీపీలో సునామీ!
తాజాగా ఏపీ ప్రభుత్వం ఐటీ సంస్థ సిస్కో, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకుంది.;

తెలుగు దేశం పార్టీలో పెను సునామీ చోటు చేసుకుంది. పార్టీ సోషల్ మీడియా సహా.. కీలక నేతలు కూడా.. తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో.. ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోంది? అని తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ వ్యక్తిగత సహాయకులు కళ్లుమూసుకుని పనిచేస్తున్నారా? అని నిప్పులు చెరుగుతున్నారు. దీనికి కారణం.. వైసీపీ హయాంలో అప్పటి విపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబును, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ సహా టీడీపీ నాయకులను తీవ్రస్థాయిలో దూషించిన ఇప్పాల రవీంద్రారెడ్డి.. తాజాగా నారా లోకేష్‌తో భేటీ కావడమే!
గుర్తించని లోకేష్..
తాజాగా ఏపీ ప్రభుత్వం ఐటీ సంస్థ సిస్కో, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకుంది. తద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సుమారు లక్ష ఉద్యోగాలు వచ్చే నాలుగేళ్లలో లభించనున్నాయి. అదేవిధంగా ఐటీలోనూ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇదిలావుంటూ.. ఈ ఒప్పందం సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో ఐటీ సంస్థ సిస్కో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. నారా లోకేష్‌తో కలిసి ఫొటోలు దిగారు. అయితే.. వీరిలో సిస్కో సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ అకౌంట్ మేనేజర్ హోదాలో ఇప్పాల రవీంద్రారెడ్డి కూడా నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. కానీ, ఈయనే గతంలో టీడీపీని తిట్టిపోశారని నారా లోకేష్ గుర్తించలేకపోయారు.
పెను దుమారం!
ఇక, ఇప్పాల రవీంద్రారెడ్డి.. నారా లోకేష్‌తో భేటీ అయిన ఫొటోలు బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సీనియర్లు, నాయకులు, యువ నేతలు కూడా ఘాటుగా స్పందించారు. గతంలో చంద్రబాబును, లోకేష్‌ను దారుణంగా దూషించారని, యువగళం పాదయాత్రను కూడా రవీంద్రారెడ్డి తప్పుబట్టారని వారు పేర్కొన్నారు. ఆనాటి రవీంద్రారెడ్డి వీడియోలను కూడా తాజాగా వైరల్ చేయడం ప్రారంభించారు. అలాంటి రవీంద్రారెడ్డికి ఇప్పుడు నారా లోకేష్‌ను కలుసుకునే అవకాశం ఎవరు కల్పించారని వారు ప్రశ్నించారు. దీనిపై చర్యలకు పట్టుబడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు కుమ్మరించారు.
ఆ వెంటనే దీనిపై స్పందించిన మంత్రినారాలోకేష్.. అసలు రవీంద్రారెడ్డి ఎలా వచ్చారో ఆరా తీయాలని ఆదేశించారు. అంతేకాదు.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితిలోనూ రవీంద్రారెడ్డిని చేర్చరాదని.. వేరేవారిని పంపించాలని కూడా మంత్రి సూచించారు. ఈ మేరకు ఆయన ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సంస్థకు లేఖ సంధించారు.