వెయ్యికి పైగా పదవుల భర్తీ.. కూటమిలో నామినేటెడ్ జాతర
ఏపీలో సంక్రాంతి పండగ తర్వాత గ్రామ దేవతల జాతరలు జరుగుతుంటాయి. అయితే ఈ సారి ప్రభుత్వం పదవుల జాతరకు తెరతీస్తోంది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే రెండు విడతలుగా నామినేటెడ్ పదవులను కేటాయించిన ప్రభుత్వం ఈ సారి భారీ స్థాయిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఒకేసారి వెయ్యికి పైగా పదవులను భర్తీ చేయాలని భావిస్తోంది. దీంతో మరికొద్ది రోజుల్లో నియామకాలు పూర్తి కానున్నాయి.
ఏపీలో సంక్రాంతి పండగ తర్వాత గ్రామ దేవతల జాతరలు జరుగుతుంటాయి. అయితే ఈ సారి ప్రభుత్వం పదవుల జాతరకు తెరతీస్తోంది. సంక్రాంతిలోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని భావించిన ప్రభుత్వం అది కుదరకపోవడంతో ఇప్పుడు ఫోకస్ పెంచింది. గ్రామ, మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఖాళీగా ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను జూన్ నెలాఖరులోగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ పరిధిలో ఉన్న నామినేటెడ్ పోస్టుల జాబితాను తక్షణం ప్రభుత్వానికి పంపాలని సూచించారు.
కూటమి అధికారంలోకి వచ్చాక రెండు విడతలుగా పదవులను భర్తీ చేశారు. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు, పాలకవర్గ సభ్యులను నియమించారు. ఇక టీటీడీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా విజయవాడ కనకదుర్గ ఆలయంతోపాటు శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, తలుపులమ్మలోవ, సింహాచలం ఆలయాల పాలకవర్గాలును నియమించాల్సివుంది. అదేవిధంగా డీసీసీబీలు, డీసీఎంఎస్ లు, మార్క్ ఫెడ్ వంటి సహకార బ్యాంకులకు పాలకవర్గాలను ఏర్పాటు చేయాల్సివుంది. ఇవి కాకుండా రాష్ట్రస్థాయిలో మరో 30 కార్పొరేషన్లకు పాలకవర్గాలను నియమించాల్సివుంది.
ఇలా రాష్ట్రస్థాయిలోనే సుమారుగా 250 వరకు పదవులు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు. వీటిని భర్తీ చేయడం ద్వారా కూటమిలో నేతలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీలకు పదవుల పంపకంపై అవగాహన ఒప్పందం కుదిరింది. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఆ పార్టీ నేతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట మిగిలిన రెండు పార్టీలకు 30 శాతం పదవులను కేటాయించాలని అవగాహన కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలో చేపట్టబోయే నియామకాల్లో మూడు పార్టీలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.
ఈ నెలాఖరు లేదా, వచ్చేనెల మొదటి వారంలో రాష్ట్రస్థాయి పదవులను భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నారు. ఆ తర్వాత దశలవారీగా నియోజకవర్గ స్థాయి పదవులను నియమిస్తారు. మొత్తం అన్ని నియామకాలను జూన్ నెలలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 214 మార్కెట్ కమిటీలు, సుమారు 11 వందల ఆలయాలకు ట్రస్టులను నియమించాల్సివుంది. వీటికి తగిన అభ్యర్థుల పేర్లు సూచిస్తూ తక్షణం ప్రతిపాదనలు పంపాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలను ఆదేశించారు. పార్టీ కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
మొత్తానికి పదవుల జాతరకు ముఖ్యమంత్రి తెరతీయడంతో కూటమి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరికి వారు తమకు పదవులు వస్తాయనే ఆనందంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారు. ఏదిఏమైనా ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు అన్నింటికి ఒకేసారి మోక్షం లభించనుంది.