తిరువూరు టీడీపీకి 'ఆధిపత్య' గ్రహణం!
స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, స్వయం ప్రకటిత మేధావి కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం.. పార్టీకి పెద్ద తలనొప్పిగా పెను విపత్తుగా కూడా పరిణమిం చింది;

ఎన్టీఆర్ జిల్లాలోనిఎస్సీ నియోజకవర్గం తిరువూరు తరచుగా మీడియాలో చర్చకు వస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, స్వయం ప్రకటిత మేధావి కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం.. పార్టీకి పెద్ద తలనొప్పిగా పెను విపత్తుగా కూడా పరిణమిం చింది. తాజాగా శనివారం రాత్రి 11 గంటల వరకు కూడా.. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై దృష్టిపెట్టారు. అసలు ఏం జరుగు తోంది? అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావులను ప్రశ్నించారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఎక్కడా లేని వివాదాలు ఒక్క తిరువూరులోనే ఎందుకు తెరమీదికి వస్తున్నాయని కూడా ఆయన నిలదీశారు.
అయితే.. వారు ఇతమిత్థంగా చెప్పలేకపోయారు. తాజా వివాదంలో ఓ మహిళలపై లైంగిక దాడి చేశాడంలూ.. పార్టీకే చెందిన రమేష్‌రెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి.. దీనిపై ఆచితూచివ్యవహరించి ఉండాల్సింది. లేకపోతే.. కేసును పోలీసులకు రిఫర్ చేసి ఉండాల్సింది. కానీ, ఆయన నేరుగా పార్టీ అధిష్టానాన్ని కార్నర్ చేశారు. రమేష్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నది కొలికపూడి డిమాండ్. దీనికి సంబంధించి అల్టిమేటం కూడా జారీ చేశారు. పార్టీ ఆయనను సస్పెండ్ చేయకపోతే.. తానేఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ వివాదాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న వ్యవహా రం టీడీపీకి అంతుచిక్కడం లేదు.
కట్ చేస్తే.. అసలు కొలికపూడి ఎందుకు సెంటరాఫ్‌ది మీడియాగా మారుతున్నారన్నది ప్రశ్న. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీకి సీనియర్లు చాలా మంది ఉన్నారు. అయితే.. వారిని కాదని గుంటూరు జిల్లాకు చెందిన కొలిక పూడి శ్రీనివాసరావును చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఎంపిక చేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే.. దీనిని స్థానికంగా ఉన్న నాయకులు తిరస్కరించారు. అప్పటి వరకు శ్యావల దత్‌కు టికెట్ వస్తుందని ఆశించి ప్రచారం కూడా చేశారు. కానీ, చివరి నిముషంలో కొలికపూడిని రంగంలోకి దింపేసరికి.. శ్యావలదత్ వర్గం ప్రచారానికి దూరంగా ఉంది. ఇది ఎన్నికల సమయంలోనూ వివాదానికి దారితీసింది.
అయితే.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కొలికపూడి.. ఎన్నికలసమయంలో తనకు సహకరించలేదన్న కారణంగా.. శ్యావలదత్ సహా.. అనేక మంది పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, వారు కూడా.. కొలికపూడి అంటేనే దూరం గా ఉంటున్నారు. ఇలా.. సొంత పార్టీలోనే రెండు వర్గాలు ఏర్పడి.. వివాదాలకు తెరదీయడం ప్రారంభమైంది. మరోవైపు ఈ గ్యాప్‌ను పరిగట్టిన స్థానిక వైసీపీ నాయకులు.. ఇక్కడ ఏం జరిగినా.. దానిని హైలెట్ చేయడం ప్రారంభించారు. దీంతో తిరువూరు తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న వివాదాలకు పరిష్కారం.. రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీ నాయకులను లైన్‌లో పెట్టడంతోపాటు.. విభేదాలకు తావులేకుండా సర్దు బాటు చేయడం. ఇంతకుమించి ఇప్పటికిప్పుడు మరో మార్గం అయితే కనిపించడంలేదని పార్టీ సీనియర్లే చెబుతుండడం గమనార్హం.