టీడీపీ కూటమిలో కత్తులతో పోరు
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ కూటమిలో చిచ్చు రాజుకుంటోంది.
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ కూటమిలో చిచ్చు రాజుకుంటోంది. జనసేన నుంచి ఎమ్మెల్యేగా మాధవి ఉన్నారు. ఆమెను అంతా కలిసి గెలిపించారు. కానీ కేవలం నాలుగు నెలల కాలంలోనే సీన్ మొత్తం సితార్ అయిపోయింది. ఈ సీటు కోసం చివరి నిముషం దాకా విపరీతంగా ట్రై చేసి భంగపడిన టీడీపీ సీనియర్ నాయకుడు కర్రోతు బంగార్రాజు అయితే కత్తులను బయటకు తీశారు.
ఇక వర్గ పోరుని తారస్థాయికి తీసుకుళ్ళేలా అటూ ఇటూ అంతా చేయాల్సింది చేస్తున్నారు. జనసేన నుంచి గెలిచిన లోకం మాధవి తన సీటుని పటిష్టం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. అయితే ఓన్లీ వన్ టైం ఎమ్మెల్యే మాత్రమే సుమా అని మాధవిని అలెర్ట్ చేసేలా టీడీపీ పావులు కదుపుతోంది.
గెలిచింది 2024లో అయినా ప్రస్తుతం అంతా ఉన్నది అదే క్యాలెండర్ ఇయర్ లో అయినా కూడా చూపు మాత్రం 2029 మీద ఉంది. అప్పటికి జనసేన బలపడకుండా ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ టీడీపీ తన రాజకీయ వ్యూహాలను తెర మీదకు తెస్తోంది.
ఈసారి ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలని బాహాటంగానే తమ్ముళ్ళు అంటున్నారు. అయితే మాధవి కూడా తన వంతు వ్యూహాలతో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఆమె వైసీపీ నుంచి నేతలను చేర్చుకుంటూ జనసేనను పటిష్టం చేసే పనిలో పడ్డారు. ఇక జనసేన వారికే నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇస్తూ పోతున్నారని గెలిపించిన తమను పక్కన పెడుతున్నారని తమ్ముళ్ళు ఆవేదనకు గురి అవుతున్నారు.
అయితే ఈ నేపధ్యంలో టీడీపీ నేత కర్రోతు బంగార్రాజుకు రాష్ట్ర మార్క్ ఫైడ్ చైర్మన్ పదవి దక్కింది. దాంతో ఆయన ఈ కీలకమైన పదవితో సరికొత్త అధికార కేంద్రంగా మారారు అని అంటున్నారు. నియోజకవర్గంలో అధికార కూటమి రాజకీయం కాస్తా రెండుగా నిట్ట నిలువునా చీలిపోయింది. బంగార్రాజు తన హవాను చాటుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యేను పక్కన పెట్టేస్తున్నారు.
ఎమ్మెల్యే సైతం ప్లాన్ బీ విధానాలతో వైసీపీ నేతలను తమ వైపు తిప్పుకుంటూ టీడీపీకి షాక్ ఇచ్చేస్తున్నారు 2029లో మళ్ళీ తనకే టికెట్ అన్నట్లుగా ఇప్పటి నుంచే పార్టీలో బలమైన నేతగా మారాలని మాధవి చేస్తున్న ప్రయత్నానికి బంగార్రాజు కొత్త పదవి తో చెక్ పెడుతున్నారు. ఇక కూటమిలో ఇలా కీలక నాయకులు వర్గ పోరుతో ముందుకు సాగడం పట్ల అటు జనసేన ఇటు టీడీపీ అధినాయకత్వాలు ఇద్దరినీ పిలిచి సయోధ్యతో సాగాలని సూచించినా కూడా వ్యవహారం అలాగే ఉంది అని అంటున్నారు.
ఇక భోగాపురం ఎయిర్ పోర్టు రానున్న కాలంలో నిర్మాణం కానుంది. అది కనుక పూర్తి అయితే నెల్లిమర్ల విశాఖతో సమానంగా మరో సిటీగా మారుతుంది. దాంతో నెల్లిమర్లకు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వారి ఇమేజ్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కావడంతో ప్రోటోకాల్ వ్యవహారాలలో ఎమ్మెల్యేకే పెద్ద పీట వేస్తారు.
దానితో పాటు రియల్ బూమ్ కూడా ఈ ప్రాంతంలో బాగా విస్తరించడం రేపటి రోజున బిజినెస్ అంతా ఈ వైపునకే వస్తుంది అన్న అంచనాలు ఉండడంతో నెల్లిమర్ల ఎమ్మెల్యే అంటే మంత్రితో సమానం అని అంటున్నారు. అందువల్లనే 2029 లో కచ్చితంగా ఈ సీటుకు కొట్టాల్సిందే అని జనసేన ఎమ్మెల్యే మాధవి. అలాగే టీడీపీ నేత కర్ర్రోతు బంగార్రాజు ఎవరి వ్యూహాలలో వారు మునిగితేలుతున్నారు. దాంతో అక్కడ కత్తులతోనే సమరం సాగుతోంది అని అంటున్నారు.