పరిటాల హత్య కేసు... 18 ఏళ్ల తర్వాత కీలక పరిణామం!
ఈ కేసులో నిందితులుగా ఉన్న నారాయణ రెడ్డి (ఏ-3), రేఖమయ్య (ఏ-4), రంగనాయకులు (ఏ-5), వడ్డే కొండ (ఏ-6), ఓబిరెడ్డి (ఏ-8)కి బెయిల్ మంజూరైంది.
మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనమైన సంగతి తెలిసిందే. ఆ హత్య కేసు ఇప్పటికీ నెట్టింట చర్చనీయాంశం అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఐదుగురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అవును... మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్ దొరకడం గమనార్హం!
ఈ కేసులో నిందితులుగా ఉన్న నారాయణ రెడ్డి (ఏ-3), రేఖమయ్య (ఏ-4), రంగనాయకులు (ఏ-5), వడ్డే కొండ (ఏ-6), ఓబిరెడ్డి (ఏ-8)కి బెయిల్ మంజూరైంది. అయితే.. ఈ సందర్భంగా షరతులు విధించింది హైకోర్టు. ఇందులో భాగంగా... ప్రతీ సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని, రూ.25 వేలతో రెండు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో... జైలు నుంచి విడుదలయిన తర్వాత నడవడిక బగోలేనట్లు ఫిర్యాదు వస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. ముద్దాయిలు దరఖాస్తు చేసుకుంటే ముందస్తు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
కాగా... టీడీపీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరు, మాజీ మంత్రి పరిటాల రవి 2005 జనవరి 24న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నాడు పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా.. ప్రత్యర్థులు దాడి చేసి ఆయనను హత్యచేశారు! ఆయన హత్యానంతరం ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చి, మంత్రిగా కూడా పనిచేశారు.