లెక్కలు తేల్చిన చంద్రబాబు.. తమ్ముళ్లకు ఆదేశం..!
వాస్తవానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రోజు.. చంద్రబాబు దేశవ్యాప్తంగా చూసుకుంటే వికసిత భారత్‌కు మేలి మలుపుగాఈ బడ్జట్ ఉంటుదని పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు లెక్క తేల్చారు. ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో ఏపీకి ఎంతిచ్చారు? ఏమిచ్చారనే విషయాలపై ఆయన కూలంకషంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు, ఉన్నతాధికారులతో దీనిపై చర్చించారు. అనంతరం.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. లెక్కలు పోల్చి చూసుకున్నారు. కేంద్ర బడ్జెట్లో బిహార్ రాష్ట్రానికే ఎక్కువగా కేటాయింపులు జరిగాయన్న వాదనలో పసలేదని.. ఏపీకే ఎక్కువగా కేటాయింపులు వచ్చాయని బాబు నిర్దారించుకున్నారు.
వాస్తవానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రోజు.. చంద్రబాబు దేశవ్యాప్తంగా చూసుకుంటే వికసిత భారత్‌కు మేలి మలుపుగాఈ బడ్జట్ ఉంటుదని పేర్కొన్నారు. కానీ, రోజులు గడిచిన తర్వాత.. పూర్తిస్థాయిలో బడ్జెట్ గ్లాన్స్ వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు.. వచ్చే నిధులపై చంద్రబాబు కు స్పష్టత వచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారుల నుంచి ఆయన పలునివేదికలు రూపొందించుకున్నారు. దీని ప్రకారం.. కేంద్రం నుంచి మొత్తంగా 23 వేల కోట్ల రూపాయలు ఏపీకి వివిధ రూపాల్లో రానున్నాయి.
ఇక, బిహార్‌కు కేవలం 17 వేల కోట్ల రూపాయలు మాత్రమే రానున్నాయని స్పష్టమైంది. అయితే.. ప్రకటన ల విషయంలో బిహార్ పేరు ప్రముఖంగా వినిపించే సరికి అందరూ వ్యతిరేక ప్రచారం చేశారని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన కేటాయింపులపై పార్టీ మంత్రులు, నాయకులు , ఎమ్మెల్యేలు.. ప్రచారం చేయాలని.. ప్రజలకు వివరించాలని ఆదేశించారు. నివేదికలను కరపత్రాల రూపంలో నాయకులకు అందించనున్నారు.
ఇక, చంద్రబాబు పేర్కొంటున్న కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు పరిశీలిస్తే.. పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు, మరో 12157 కోట్ల మేరకు బ్యాలెన్స్ గ్రాంటు రానుంది. అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి రూ.3295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు రానున్నాయి. ఆరోగ్య సేవలను విస్తరించేందుకు 162 కోట్లు, జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ.186 కోట్లు కేటాయించారు. రహదారుల, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, జీవన స్థాయిలను మెరుగు పరిచేందుకు 242 కోట్లను కేటాయించారు.