తంబళ్లపల్లి టీడీపీ రోడ్డున పడిందా.. వాట్ నెక్ట్స్...?
నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న జయచంద్రారెడ్డిని సొంత పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యా దవ్ వ్యతిరేకిస్తున్నారు.;

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం తమ్ముళ్లు రోడ్డున పడ్డారు. సాక్షాత్తూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముందే.. నియోజవకర్గం టీడీపీ ఇంచార్జ్ జయచంద్రారెడ్డి ఆయన అనుచరులు వీరంగం వేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గంతో తన్నులాటకు దిగారు. బండ బూతులు తిట్టుకున్నారు. ఎవరూ తగ్గలేదు. ఒకరిపై ఒకరు కలబడ్డారు. దీంతో ఉద్రిక్తత పెరుగుతుందని గుర్తించిన మంత్రి.. బీసీ వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా ఉందని బీసీ జనార్దన్‌రెడ్డి మీడియాకే చెప్పేశారు. ప్రస్తుతం తంబళ్లపల్లెలో వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి చక్రం తిప్పు తున్నారు. ఈయనకు తిరుగులేని ఆధిపత్యం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీస్తే.. ఇక్కడ మాత్రం వైసీపీ హవా నడిచింది. దీంతో టీడీపీ ఇక్కడ పాగా వేయలేక పోయింది. ఈ పరిణామాల నుంచి పార్టీని గట్టెక్కించి.. లైన్‌లో పెడతారని భావించిన సీనియర్ నాయకులే సీరియస్‌గా తన్నుకోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఏంటి వివాదం?
నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న జయచంద్రారెడ్డిని సొంత పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యా దవ్ వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నాయకులతో ఆయన కలిసిపోయారని.. అంతర్గత ఒప్పందాలు చేసుకు న్నారన్నది ఆయన ఆరోపణ. కాబట్టి.. నియోజకవర్గం బాధ్యతలను తనకు ఇవ్వాలని శంకర్ కోరుతున్నా రు. మరోవైపు.. ఇదే విషయాలపై జయకు వ్యతిరేకంగా.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక, శంకర్‌యాదవే వైసీపీవర్గాలతో కలిసిపోయారని జయ ఆరోపిస్తున్నారు.
అందుకే.. తనను ముందుకు సాగకుండా.. సోషల్ మీడియా ద్వారా అడ్డుకట్ట వేస్తూ.. విమర్శలు గుప్పిస్తు న్నారని.. జయ చెబుతున్నారు. ఈ క్రమంలో శంకర్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తే.. తప్ప.. ప్రయోజనం లేదని ఆయన అంటున్నారు. ఈ పరిణామాలపై ఇప్పటికే రెండు సార్లు చర్చించిన పార్టీ అధిష్టానం.. తాజాగా మంత్రి బీసీకి బాధ్యతలు అప్పగించింది. వివాద పరిష్కారం కోసం .. ఆయన ఆదివారం రాగా.. ఆయన ముందే.. వీరి వర్గాలు బాహాబాహీకి దిగి... రచ్చ చేశాయి. దీంతో సీరియస్‌గా తీసుకున్న మంత్రి దీనిపై చంద్రబాబుకు నివేదిక ఇస్తా నంటూ వెళ్లిపోయారు. మరి ఏం చేస్తారో చూడాలి.