నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటి ?

నిజానికి లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెర లేపుతున్నారు.

Update: 2025-01-19 22:30 GMT

ఏపీలో టీడీపీ కూటమిలో అనూహ్యమైన పరిణం ఏదీ జరగడంలేదు. లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావడం అన్నది సహజాతి సహజమైన డిమాండుగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే టీడీపీ 2024లో అధికారంలోకి రావడానికి నారా లోకేష్ చాలా కష్టపడ్డారు అన్నది తెలిసిందే.

ఆయన మండుటెండలో ప్రాణాలకు తెగించి మరీ భారీ పాదయాత్ర చేపట్టారు. వేలాది మైళ్ళు నడిచారు. జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. నారా లోకేష్ ని ఒకనాటి పప్పుగా ఎవరూ చూడడం లేదు. ఆయన బాగా మారారు. రాజకీయంగా అనుభవం పరిణితి కావాల్సినంత సంపాదించుకున్నారు

నిజం చెప్పాలంటే చంద్రబాబు సీఎం అయితే లోకేష్ డిప్యూటీ సీఎం కావడం అన్నది చాలా నాచురల్ గానే తమ్ముళ్ళు కోరుకునే విషయంగా అంతా చూస్తున్నారు. దేశంలో చాలా చోట్ల తండ్రులు అధికారంలో ఉన్నపుడు కుమారులు డిప్యూటీ సీఎంలుగా పాలించిన దాఖలాలు అనేకం ఉన్నాయి.

ఇక లోకేష్ విష్యంలోనే అది ఆలస్యం అయింది ఒక విధంగా ఆయనకు కొంత అన్యాయం జరిగింది అని కూడా అంటున్న వారూ ఉన్నారు. టీడీపీలో ఈ రోజు లోకేష్ పట్టు బాగా పెరిగింది. ఏపీలోని కూటమిలో మొత్తం 134 మంది టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ 43 ఏళ్ల పార్టీ. ఆ పార్టీ డిప్యూటీ సీఎం గా లోకేష్ కి చాన్స్ ఇవ్వాలీ అనుకుంటే అది చిటిక వేసినంత పని.

దాని కోసం వేరేగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అని అంటున్నారు. అయితే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట్లోనే తప్పు చేసారు అని అంటున్న వారూ ఉన్నారు. ఆయన కేబినెట్ ప్రమాణం అపుడే అంటే 2024 జూన్ 12 నాడే పవన్ లోకేష్ ఇద్దరినీ ఉప ముఖ్యమంత్రులుగా చేయాల్సి ఉండేది. అలా కనుక నాడే చేస్తే ఈ రోజున ఇంత చర్చ ఉండేది కాదు, ఎవరూ అసలు మాట్లాడే వారు కాదు.

నిజానికి లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెర లేపుతున్నారు. దీని వల్ల కూటమి విచ్చిన్నం అవుతుందని కూడా కొందరు అభిప్రాయాలు వెల్లబుచ్చుతున్నారు. అసలు పవన్ కి ఇచ్చిన శాఖలు వేరు, లోకేష్ చూస్తున్న శాఖలు వేరు. ఈ ఇద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఎవరి పనితీరుని వారు కనబరుస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ అయినంతమాత్రాన పవన్ అధికారాలకు కత్తెర వేసే పని ఉండదు, ఎవరి పరిధులు వారికి ఉంటాయి. ఎవరి అధికారాలు వారికి ఉంటాయి. ఎవరికి వారు ఇప్పటిమాదిరిగానే హ్యాపీగా పనిచేసుకోవచ్చు అని అంటున్నారు.

అయితే జనసైనికులు మాత్రం కొందరు అభద్రతాభావంతో ఈ తరహా పోస్టులు పెడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే అది తమ్ముళ్లకు జోష్ గా ఉంటుంది, టీడీపీ ఒక రాజకీయ పార్టీగా తన పార్టీని పటిష్టం చేసుకోవడానికి యువతను మరింతగా ఆకట్టుకోవడానికి టీడీపీకి మూడవ తరం నాయకుడిగా లోకేష్ ని ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పదవుని ఇస్తున్నారు తప్ప మరేమీ కాదు.

ఇందులో జనసేనకు కానీ బీజేపీకి కానీ వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ప్రతీ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నపుడు మరింతగా బలపడేలాగ చూసుకుంటుంది. అంతే కాదు భవిష్యత్తుని కూడా ఆలోచిస్తుంది.

అయితే లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి అనేసరికి ఈ తరహా కామెంట్స్ కానీ విమర్శలు కానీ రావడంతో జనసేనికులు కొందరు చేస్తున్న కామెంట్స్ మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయని అంటున్నారు.

అంతే కాదు సోషల్ మీడియాలో విచిత్రమైన కారణాలతో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరుగుతోంది అంటున్నారు. ఇక చూస్తే ఈ రకమైన కామెంట్స్ ఎంతదాకా పోయాయి అంటే ఇది కూటమిని కూడా విచ్ఛిన్నం చేయవచ్చని కొందరు అంటూంటే మరి కొందరు అయితే ఇది పవన్ కళ్యాణ్‌పై కుట్ర అని కూడా అంటున్నరు. ఇంకాస్తా ముందుకు వెళ్ళి మరి కొందరు నారా లోకేష్‌ను ఉపముఖ్యమంత్రిగా ఎంచుకుంటే పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నిజానికి లోకేష్ కి ఈ ప్రమోషన్ దక్కడానికి అవసరమైన అర్హత ఉందని కూడా అంటున్న వారూ ఉన్నారు. లొకేష్ కి జనాదరణ విషయంలో చూసుకుంటే మంగళగిరిలో ఆయన రికార్డు మెజారిటీ అని దర్శనం. పార్టీలో కావాల్సిన ఆదరణ కూడా సంపాదించుకున్నారు. 2014 నుంది 2019 మధ్య మంత్రిగా ఆయన బాగానే పనిచేశారు అని కూడా అంతా చెప్పుకుంటారు.

అలాంటప్పుడు అతనికి ఉప ముఖ్యమంత్రిగా లభించే అవకాశం ఎందుకు వద్దు అనాలని కూడా చర్చ సాగుతోంది. గత జగన్ ప్రభుత్వంలో చూస్తే ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అలాంటపుడు ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నియమించుకోవడం తప్పు ఎలా అవుతుందని అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News