సీఐ చేత ‘సారీ’ చెప్పించుకొని ఎమ్మెల్యే ఆస్మిత్ రెడ్డి తప్పు చేశారా?
పోలీసు అధికారుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసే ఎమ్మెల్యేలను చూశాం
పోలీసు అధికారుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసే ఎమ్మెల్యేలను చూశాం. కానీ.. ఈ ఎపిసోడ్ అందుకు భిన్నం. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తూ.. అలాంటి తప్పులు చేసే వారి మీద కేసులు పెట్టమని కోరటం ఎమ్మెల్యే తప్పైంది. అందుకు ఒక సీఐ స్థాయి అధికారి.. నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి? అంటూ ప్రశ్నించిన తీరు సంచలనంగా మారింది. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయటం.. కొంత తర్జనభర్జనల తర్వాత సదరు సీఐ.. ఎమ్మెల్యేకు సారీ చెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాడిపత్రిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో టీడీపీ ఎమ్మెల్యే ఆస్మిత్ రెడ్డి తీరును ఆయన రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. సీఐ చేత సారీ చెప్పించుకుంటావా? ఇదేం రాక్షస ఆనందం అంటూ మండిపడుతున్నారు. ఇంతకూ.. సీఐ చేత సారీ చెప్పించుకొని ఎమ్మెల్యే ఆస్మిత్ రెడ్డి తప్పు చేశారా? అసు విషయం అంతవరకు ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. మొత్తం సీన్ అర్థమవుతుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీన్ని కట్టడి చేయాలని.. తప్పుడు పనులకు పాల్పడే వారిపై కేసులు పెట్టాలంటూ సీఐ లక్ష్మీకాంత రెడ్డిని కోరారు స్థానిక ఎమ్మెల్యే ఆస్మిత్ రెడ్డి. అయితే.. సీఐ మాత్రం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఐ తీరును ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ సందర్భంగా సదరు సీఐ చెలరేగిపోయారు. ఎమ్మెల్యే అన్నది చూసుకోకుండా నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి? అంటూ ప్రశ్నించారు.
దీనికి ముందు టీడీపీకి చెందిన నేతలు కొందరు ఇచ్చిన సమాచారంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలాంటి సందర్భాల్లో కేసులు నమోదు చేస్తారు. కానీ.. ఈ ఎపిసోడ్ లో మాత్రం అలా చేయని పరిస్థితి. దీంతో.. సదరు టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే ఆస్మిత్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో.. ఆయన సీఐకు ఫోన్ చేసిన ఇసుక అక్రమ రవాణా పై కేసులు నమోదు చేయాలని సూచించారు.
సాధారణంగా ఎవరైనా తప్పుడు పనులు చేస్తూ దొరికినప్పుడు.. కేసు కట్టకుండా ఉన్నప్పుడు.. ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి కేసు కట్టమని అడిగే వరకు ఆగరు. కానీ.. ఈ ఎపిసోడ్ లో ఆగటం ఒకఎత్తు అయితే.. ఫోన్ చేసిన ఎమ్మెల్యేతో దురుసుగా వ్యవహరించారు సదరు సీఐ. ''నువ్వు చెబితే కేసులు కట్టాలా? నాకు చెప్పటానికి నువ్వెవడివి?'' అంటూ ఏకవచనంతో విరుచుకుపడటంతో విస్మయానికి గురయ్యారు ఆస్మిత్ రెడ్డి.
దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆస్మిత్ రెడ్డి.. నేరుగా తాడిపత్రి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎదుట తన అనుచరులతో ధర్నా చేశారు. ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న డీఎస్పీ జనార్దన్ నాయుడు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తనతో దరుసుగా మాట్లాడిన సీఐ సారీ చెప్పాలని కోరారు. కొద్ది గంటల అనంతరం ఎమ్మెల్యే ఆస్మిత్ రెడ్డికి ఫోన్ చేసిన సీఐ లక్ష్మీకాంత రెడ్డి సారీ చెప్పారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. వాహనంలో వెళుతున్న సీఐ.. కొన్ని మీడియా చానళ్ల వారు మాట్లాడారు. ఈ సందర్భంగా సదరు సీఐ తన వాదనను వినిపిస్తూ.. ఎమ్మెల్యేను తానేమీ అనలేదని.. తాను కొన్నినెలలుగా ఇదే స్టేషన్ లో పని చేశానని.. ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని ఎమ్మెల్యే అడిగితే సాధ్యం కాదని.. డీఎస్పీ చేత కేసు నమోదు చేయాలని కోరినట్లుగా పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే మీద ఒక సీఐ దురుసుగా వ్యవహరిస్తే ఊరుకుంటారా? సారీ చెప్పించుకోరా? అని ప్రశ్నిస్తున్నారు.