జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి వెరీ నియర్ !
తెలుగుదేశం పార్టీలో కొత్త తరం వస్తోంది. సరికొత్త శకంలోకి అడుగుపెడుతోంది. తెలుగుదేశం పార్టీ ఇటీవలనే 43వ వసంతంలోకి అడుగుపెట్టింది.;

తెలుగుదేశం పార్టీలో కొత్త తరం వస్తోంది. సరికొత్త శకంలోకి అడుగుపెడుతోంది. తెలుగుదేశం పార్టీ ఇటీవలనే 43వ వసంతంలోకి అడుగుపెట్టింది. అర్ధ శతాబ్దం చరిత్రకు అతి దగ్గరలో ఉంది ఒక రాజకీయ పార్టీ ఇన్నేళ్ళ పాటు మనుగడ సాగించడం అధికారాన్ని అనేక దఫాలుగా అందుకోవడం అన్నది సాధారణ విషయం అయితే కాదు. తెలుగుదేశం పార్టీ లాంటి వాటికే అది సాధ్యం.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇపుడు నారా చంద్రబాబు నాయకత్వంలో ఉంది. ఆయన తన తరువాత మెల్లగా తనయుడు నారా లోకేష్ ని ప్రమోట్ చేస్తున్నారు. తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో పట్టుని లోకేష్ ఇప్పటికే సాధించారు. పైగా తనను తాను రుజువు చేసుకున్నారు. ఆయన యువగళం పేరుతో ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర కూడా టీడీపీ విజయానికి ఎంతగానో దోహదపడింది అని చెప్పాలి.
ఇక ప్రభుత్వంలో కూడా తనకు అప్పగించిన శాఖలను సమర్ధంగా లోకేష్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన తండ్రి మాదిరిగానే అన్ని పార్టీలతోనూ అందరి నేతలతోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో నందమూరి వారి సంగతి ఏమిటి అన్న చర్చ ఉండనే ఉంది. నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ కాబట్టి ఆ వారసులను కూడా ఈ పార్టీలో ఉండాలని అంతా కోరుకుంటారు.
ఇక ఎన్టీఆర్ కుటుంబం నుంచి గతంలో హరికృష్ణ టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పొలిట్ బ్యూరో మెంబర్ గా కూడా పనిచేశారు. దాని కంటే ముందు తెలుగు యువత అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. అలా అన్న గారి వారసులలో హరికృష్ణకు టీడీపీతో అనుబంధం మెండు. ఆయన తర్వాత సినీ హీరో నందమూరి బాలకృష్ణ టీడీపీలో క్రియాశీలంగా కొనసాగుతున్నారు.
ఆయన 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయినప్పటికీ తండ్రి పార్టీ పెట్టిన మొదటి నుంచి ఆ పార్టీ విజయం కోసం తన వంతుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. టీడీపీ ప్రతీ రాజకీయ దశలోనూ బాలక్రిష్ణ కనిపిస్తారు. ఇక ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి రాలేదని అభిమానులు అంటారు కానీ ఆయన కోరుకుంటే అదేమంత పెద్ద విషయం కాదని అనేవారూ ఉన్నారు ఆయన సినిమాల్లో ఇంకా తన ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్నారు కాబట్టే మంత్రి పదవి వైపు పూర్తి స్థాయిలో చూడటం లేదని అంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి బాలయ్య ఏడు పదులకు చేరువ అవుతారు. బహుశా ఆయన మరోసారి పోటీ చేసి మంత్రి పదవి కానీ ఇంకా కీలకమైన పదవులు కానీ చేపట్టే అవకాశాలు తోసిపుచ్చలేమని అంటారు. ఇక మూడవ తరంలో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. ఈ ఇద్దరూ వెండి తెర మీద హీరోలుగా రాణిస్తున్నారు. జూనియర్ అయితే అంతర్జాతీయంగా తన సత్తాను చాటుకుంటున్నారు. ఆయన సినీ కెరీర్ ఇపుడు ఉజ్వలంగా సాగుతోంది. కచ్చితంగా మరో ఇరవై ఏళ్ళకు పైగా ఆయన ఇదే దూకుడుని కొనసాగిస్తారు అని వేరేగా చెప్పనక్కరలేదు.
కళ్యాణ్ రామ్ అయితే హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకుని ముందుకు సాగుతున్నారు ఇక నరసారావుపేట టూర్ లో కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా పట్టారని అది పెద్ద వార్తగా చేశారు. నిజానికి టీడీపీకి జూనియర్ ఆయన బ్రదర్ ఎపుడూ దూరంగా లేరని అంటున్నారు. సినీ రంగం సున్నితమైనది అందుకే రాజకీయాల ప్రస్తావన లేకుండా కొంత జాగ్రత్త పడడం తప్ప పార్టీకి తాము దూరమని ఎపుడూ ఈ బ్రదర్స్ చెప్పలేదని అంటారు.
ఇక చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో చురుకైన పాత్ర పోషించాలని ఆయన పార్టీ జెండా పట్టుకోవాలని కోరుకునే తమ్ముళ్ళు కో కొల్లలు. టీడీపీలో చూస్తే నారా లోకేష్ కూడా ఏమీ ఎవరినీ వదులుకోవడం కానీ కాదనుకోవడం కానీ చేసే వారు కాదని ఆయన చర్యలను బట్టి అర్థం అవుతోంది. ఎన్ని చెప్పుకున్నా నారా నందమూరి కుటుంబాలు టీడీపీకి రెండు కళ్ళు అని అంతా అంటారు.
తెలుగుదేశం పార్టీకి వారసులు ఎవరు అన్నది ఎపుడూ ప్రశ్న కానే కాదని కూడా అంటారు. అవన్నీ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే అని చెబుతారు. తెలుగుదేశం పార్టీకి తిరుగులేని సినీ ఆకర్షణ ఉందని దానిని పుష్కలంగా వాడుకోవాలని సూచించే వారూ ఉన్నారు వేరే ఇతర హీరోల మీద ఆధారపడటం కంటే ఇది ఉత్తమమం అన్నది తమ్ముళ్ల మాట. మరి ఈ రోజున కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా పట్టి ఒక అనుమానాన్ని నివృత్తి చేశారు. రేపటి రోజున జూనియర్ కూడా జనంలోకి వచ్చి ఇదే విధంగా జెండా ఎత్తితే ఆనాడే టీడీపీ శ్రేణులకు అసలైన పర్వదినం అని అంటున్నారు.