కడపలో మహానాడు వెనక భారీ స్ట్రాటజీ
అందుకే ఆయన తన పాలన మీద ఒక వైపు ఫోకస్ పెడుతూ మరో వైపు వైసీపీని మళ్ళీ తిరిగి లేవకుండా తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నారు.
ప్రత్యర్థిని బలహీనంగా ఉన్నపుడే వెన్ను విరచాలి. అవకాశం ఉన్నపుడే శత్రు శేషం లేకుండా చేసుకోవాలి. ఈ విషయాలు రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు గడించిన చంద్రబాబుకు తెలియనివి కావు. అందుకే ఆయన తన పాలన మీద ఒక వైపు ఫోకస్ పెడుతూ మరో వైపు వైసీపీని మళ్ళీ తిరిగి లేవకుండా తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నారు.
వైసీపీకి ఈ రోజుకీ 40 శాతం ఓటు షేర్ ఉంది. మరో పది శాతం పెంచుకుంటే మళ్ళీ అధికారం దక్కుతుంది. వైసీపీ చేసే ప్రయత్నాల వల్ల ఒక అయిదు శాతం పెరిగినా ప్రభుత్వ పరంగా యాంటీ ఇంకెంబెన్సీ తోడు అయి మరో అయిదు శాతం జత కలిస్తే చాలు మళ్ళీ ఏపీలో వైసీపీకి చాన్స్ ఉంటుంది.
అందుకే ఈ రెండూ జరగకుండా ఈసారి ప్రభుత్వంలోకి వస్తూనే డే వన్ నుంచి చంద్రబాబు తనదైన శైలిలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గతంలో చేసిన పొరపాట్లు ఈసారి చేయకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీకి ఏ మాత్రం పాజిటివిటీ రాకుండా చూస్తున్నారు.
వైసీపీ విషయంలో బహుముఖమైన రాజకీయాన్ని ప్రయోగిస్తున్నారు. గతంలో ఆ పార్టీ వారిని తీసుకోవడం 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని మరి నలుగురుని మంత్రులుగా చేయడం ద్వారా వైసీపీకి సానుభూతి వచ్చేలా చూసిన టీడీపీ అధినాయకత్వం ఈసారి మాత్రం వాటిని పునరావృత్తం చేయదలచుకోలేదు.
వైసీపీ నేతల మీద కేసులు పెట్టినా అవి సాక్ష్యాధారాలతో సహా ఉంటేనే అడుగులు ముందుకు వేస్తోంది. అదే విధంగా వైసీపీ అధినాయకత్వం నుంచి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని సైతం బయటకు వచ్చేలా చూస్తోంది.
ఇపుడు వైసీపీ అధినేత సొంత జిల్లా ఆ పార్టీకి ఖిల్లాగా ఉన్న కడప గడపలోనే భారీ రాజకీయ భేరీని మోగించాలని చూస్తోంది. వైసీపీ ఓటమి పాలు అయినా కడపలో జగన్ కి విశేషమైన జనాదరణ లభిస్తోంది. దానిని పూర్వ పక్షం చేస్తూ కడపలో సైతం పసుపు జెండాలు రెపరెపలాడేలా చేయాలన్నదే టీడీపీ వ్యూహకర్తల లక్ష్యంగా ఉంది.
అందుకే కడపలో మహానాడుని ఏర్పాటు చేయబోతున్నారు. గడపలో మే 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. మూడవ రోజున భారీ బహిరంగ సభ ఉంటుంది. చంద్రబాబు ఆ సభలో ప్రసంగం చేస్తారు. ఈ సభతోనే వైసీపీకి చెక్ పెట్టేలా చూడాలన్నది టీడీపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. మొత్తం కడపలో కనీవినీ ఎరుగని తీరులో భారీ బహిరంగ సభను నిర్వహించడం అంతటా పసుపు దనాన్ని వెల్లి విరిసేలా చూడడం చేయాలని భావిస్తోంది.
కడపలోనే టీడీపీకి ఇంతటి జనాదరణ దక్కిందన్న సందేశాన్ని యావత్తు రాష్ట్రానికి చేరవేయడం ద్వారా వైసీపీని ఉన్న చోటనే నీడ లేకుండా చేయడంతో పాటు అధినేత జిల్లాలోనే సొంత ఇలాకాలోనే వైసీపీ ఏమీ కాకుండా పోయిందన్నది ప్రచారం చేయడం మరో లక్ష్యంగా ఉంది. దాంతో వైసీపీ శ్రేణులు డీ మోరలైజ్ అవుతాయని అంతే కాదు ఏపీలో రాజకీయం ఏకపక్షమే అన్నది జనాలకు కూడా తెలియచెప్పడం కూడా టార్గెట్ గా ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీ పద్మ వ్యూహంలో భాగమే కడప మహానాడు అని అంటున్నారు.