పంచేసుకున్నారు.. తమ్ముళ్లా మజాకా?!
సరే..రాజకీయాల్లో ఇదంతా సహజమే కదా! అని పెదవి విరవడానికి ఇదేమీ తక్కువ విషయం కాదు.
By: Tupaki Desk | 12 Oct 2024 4:52 PM GMTఔను.. ఇది అక్షరాలా నిజం. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు 134 మంది ఉన్నారు. వీరిలో చంద్రబాబు వంటి కొందరు ప్రముఖులను పక్కన పెడితే.. 120 మంది కీలకంగా ఉన్నారు. వీరిలో 100 మందిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాలు.. ఎవరో చెబితే.. ''అదిగో మేం గెలిచామని అక్కసు'' అని మీద పడిపోతారు. నిత్యం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసే కీలక ప్రధాన మీడియాల్లోనే ''పంచేసుకున్నారు'' అని లెక్కలతో సహా కుండబద్దలు కొట్టేస్తున్నారు.
సరే..రాజకీయాల్లో ఇదంతా సహజమే కదా! అని పెదవి విరవడానికి ఇదేమీ తక్కువ విషయం కాదు. సుమారు.. 3000 కోట్ల రూపాయలకు పైగానే సొమ్మును తమ్ముళ్లు పంచేసుకున్నారని పెద్ద ఎత్తున నియోజక వర్గాల్లో విమర్శలు, వివాదాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. తాజాగా నూతన మద్యం పాలసీకి ఏపీ సర్కారు రంగం రెడీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తం 3386 దుకాణాలను తొలి దశలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇవన్నీ కూడా ప్రైవేటు దుకాణాలే. ఇకపై ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయదు. కేవలం వాటిని ప్రైవేటు కు అప్పగించి ఏటాఇంతని ఫీజుల రూపంలోనూ నెలనెలా పన్నుల రూపంలోనూ వసూలు చేసుకుంటుం ది. అయితే.. 3,386 దుకాణాలకు ప్రభుత్వం అంచనా ప్రకారం.. ఒక్కొక్క షాపు ఏర్పాటుకు ఎంత లేదన్నా.. 40 మంది వ్యాపారులు పోటీ పడతారని లెక్కవేసుకుంది. ఒక్కొక్క చోట ఒక్క షాపుకే 100 మంది పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల తగ్గొచ్చు. ఇలా.. సగటున ఒక్క షాపుకు 40 మంది పోటీ పడతారని భావించింది.
ఈ క్రమంలోనే షాపు ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు రుసుమును రూ.2,00,000గా నిర్ణయించింది. దీని ప్రకారం.. లక్షా 50 వేల దరఖాస్తులు రావాలి. ఆ లెక్కన సర్కారుకు కేవలం దరఖాస్తుల రూపంలోనే 3 వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. కానీ, కేవలం 89 వేల దరఖాస్తులే వచ్చాయి. సొమ్ముల రూపంలోనూ 1800 కోట్ల రూపాయలే వచ్చింది. నిజానికి మద్యం వ్యాపారస్తులు.. కూటమి సర్కారురావాలని కోరుకున్నారు. వైసీపీ హయాంలో చేతులు ముడుచుకుని వ్యాపారాలు లేక ఇబ్బంది పడ్డారు.
మరి భారీ ఎత్తున స్పందన రావాల్సి ఉన్నా.. ఇలా ఎందుకు జరిగింది? అంటే.. టీడీపీతమ్ముళ్ల మంత్రాం గం అక్కడే ఉంది. నియోజకవర్గాలను పాడేసుకున్నారు. ఎవరు ఎక్కువ మొత్తం తమకు ముట్ట జెబితే.. వారి దరఖాస్తులే అనుమతించేలా చక్రం తిప్పారు. దీనిలో ఎలాంటి మొహమాటాలకూ పోలేదట. పైగా ఎవరైనా ఆన్‌లైన్ లో గుట్టు చప్పుడు కాకుండా దరఖాస్తు చేసుకున్నా.. ప్రత్యేక సాఫ్ట్ వేర్ వినియోగించే క్షణాల్లో కనిపెట్టేశారు. దీంతో సదరు వ్యాపారిని పక్కకు తప్పించేశారు.
ఏం చేశారు?
ఉదాహరణకు పది దుకాణాలు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతం ఉందనుకుంటే.. ఈ పది దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు ముందుగా తమ్ముడిని కలవాలి. ఆయన ఎంపిక చేసిన వారే.. దరఖాస్తులు వేయాలి. ఈ ఎంపిక.. అనేది.. సదరు తమ్ముడు చెప్పిన మొత్తం ముందుగా ఆయనకు ఇస్తేనే దరఖాస్తు వేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు చెప్పిన మొత్తం ఇవ్వకపోతే.. రేపు వ్యాపారం ప్రారంభించిన తర్వాత.. 10 పర్సంట్ వాటా ఇవ్వాలి. ఇదీ పంచుకోవడంలో పెద్ద `కిక్కు` ఫలితంగా సర్కారుకు.. 1800 కోట్లు మాత్రమే వస్తే.. తమ్ముళ్లు మూడు రెట్లు ఆదాయం వచ్చిందట!! ఇదీ విషయం. ఏం చేస్తారు.. బాబు మాత్రం కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్టు ఉంటుందని మౌనం పాటిస్తున్నారు.