తమ్ముళ్ల బిగ్ ప్లాన్ : నామినేటెడ్ కోసమే ఈ తంటా.. !
అయితే.. ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం నారా లోకేష్ చుట్టూ తిరుగుతుండడంతో పార్టీ అధినేత చంద్రబాబు.. అసలు ఏం జరుగుతోందన్న విషయంపై ఆరా తీశారు.
క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడాల్సిన, ప్రమోట్ చేయాల్సిన నాయకులు.. కొత్త సమస్యలు సృష్టిస్తున్నారనేది టీడీపీలో జరుగుతున్న చర్చ. తమకు కావాల్సిన పదవులు పొందేందుకు నాయకులు.. ఉన్నతస్థాయి లో ఉన్నవారిని మచ్చిక చేసుకోవడం మామూలే. అయితే.. ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం నారా లోకేష్ చుట్టూ తిరుగుతుండడంతో పార్టీ అధినేత చంద్రబాబు.. అసలు ఏం జరుగుతోందన్న విషయంపై ఆరా తీశారు. ఈ క్రమంలో కొన్ని సంచలన వ్యవహారాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది.
గత నాలుగు రోజులుగా పార్టీలో డిప్యూటీ సీఎం, సీఎం అంటూ.. నారా లోకేష్ పై పెద్ద ఎత్తున చర్చ సాగిం ది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహా వర్మ వంటివారు.. ఈ విషయాన్ని హైలెట్ చేయడం తెలిసిందే. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే.. తప్పేంటని కొందరు ప్రశ్నించారు. ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇక, ఈ వ్యవహారం పుంజుకుంటున్న దశలో జనసేన నుంచి కూడా అంతే స్థాయిలో వ్యాఖ్యలు వచ్చాయి. తమ నాయకుడికి సీఎం సీటు ఇచ్చి.. మీరు ఏమైనా చేసుకోవాలని ఆ నాయకలు అన్నారు.
ఈ వ్యవహారం.. పార్టీల మధ్య ఎలా ఉన్నా.. సాధారణ ప్రజానీకంలో మాత్రం ఆరు మాసాలుగా ప్రభుత్వం చేసిన పనులను పెద్దగా చర్చకు రాకుండా పోయిందని.. పైగా ఆరు మాసాలు గడవకముందే.. పార్టీల మధ్య చిచ్చు రేగిందని కూడా.. స్థానికంగా క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. దీంతో ఇది భారీ డ్యామేజీ జరుగుతోందని గుర్తించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రస్తుతానికి కట్టడి చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో అసలు ఈ వ్యవహారానికి మూలం ఎక్కడుందని ఆరా తీసినప్పుడు కీలక నేతలే ఉప్పందించారని తెలుస్తోంది.
నామినేటెడ్ పదవుల వ్యవహారంపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే.. వీరిలో మెజారిటీ నాయకులు నారా లోకేష్‌ను కాకాపట్టే పని చేపట్టారు. ఇటీవల సంక్రాంతికి నారా వారి పల్లెకు వెళ్లినప్పుడు కూడా.. పెద్ద ఎత్తున ఆయనను కలుసుకుని ఇదే డిమాండ్ వినిపించారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం అనే చర్చకు బీజం పడింది. అంటే.. పదవులు ఆశిస్తున్న కొందరు సీమ నాయకుల నుంచే ఈ డిమాండ్ ప్రారంభమైందని పార్టీ అంచనా వేసుకుంది.
అయితే.. ఇలా ప్రచారం ప్రారంభించిన వారు సీనియర్లు కావడంతో నేరుగా మందలించకుండా.. కామన్‌గా ప్రకటన చేసిందని అంటున్నారు పరిశీలకులు. సో.. మొత్తానికి నామినేటెడ్ పదవుల వ్యవహారం.. రాబోయే రోజుల్లో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.